తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండేళ్ల తర్వాత 'పరీక్షలు'.. ఆందోళన చెందుతున్న విద్యార్థులు - Anxiety among students about writing tests

‘అమ్మో.. పరీక్షలు వచ్చేస్తున్నాయి. ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదు...’ దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి భయం. ‘లెక్కలంటే చాలా భయమేస్తోంది. సైన్స్‌లోనూ చాలా అనుమానాలున్నాయి!’.. గచ్చిబౌలికి చెందిన పదో తరగతి విద్యార్థిని ఆందోళన. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ.. రకరకాల సమస్యలతో మానసిక నిపుణుల వద్దకు వస్తున్న పిల్లల పరిస్థితికి ఉదాహరణలివి.

రెండేళ్ల తర్వాత 'పరీక్షలు'.. ఆందోళన చెందుతున్న విద్యార్థులు
రెండేళ్ల తర్వాత 'పరీక్షలు'.. ఆందోళన చెందుతున్న విద్యార్థులు

By

Published : Apr 15, 2022, 5:15 AM IST

కరోనా మహమ్మారి వల్ల ఒడిదొడుకులకు గురైన విద్యావ్యవస్థలో ఇన్నాళ్లకు పరిస్థితులు సాధారణస్థితికి వచ్చి.. వార్షిక పరీక్షల స్థాయికి చేరుకున్నాయి. రెండేళ్ల తర్వాత పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉండడంతో విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు, మానసిక ఒత్తిడి ఎక్కువవుతున్నాయని మనస్తత్వ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి, పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ ఆందోళనతో తమ వద్దకు వచ్చే పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వల్ల రెండేళ్లుగా పాఠశాలలు సరిగా నడవక విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ పాఠాలు చాలా తక్కువ మందికే చేరాయి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎనిమిదో తరగతి ముగింపు దశలో ఉండగా.. కొవిడ్‌ వ్యాపించడంతో పరీక్షలు జరగలేదు. తరువాత సంవత్సరం కూడా అదే పరిస్థితి రావడంతో తొమ్మిదో తరగతి కూడా ఆన్‌లైన్‌లోనే గడచిపోయింది. పదో తరగతిలో 70 శాతం సిలబస్‌కే పరిమితం చేసినా.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి వల్ల తరగతులు అరకొరగానే సాగాయి. ఆ విద్యార్థులు రెండేళ్ల తర్వాత ఇప్పుడు వార్షిక పరీక్షలు రాయబోతున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులదీ అదే పరిస్థితి. కొన్ని సూచనలు పాటిస్తే భయాలను అధిగమించి పరీక్షల్లో గట్టెక్కవచ్చని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత ఇదీ..

* పిల్లల సామర్థ్యాలకు తగ్గట్టుగానే ప్రోత్సహించాలి. అతి అంచనాలు వేయకూడదు. దీనివల్ల పిల్లల్లో ఒత్తిడి మరింత అధికమవుతుంది.

* ఫలితాలు ఎలా ఉన్నా, ‘ఫరవాలేదు.. మేమున్నా’మంటూ తరచూ ధైర్యం చెప్పాలి.

* పిల్లలకు సమతులాహారం, సరిపడా తాగునీరు ఇవ్వడం, విశ్రాంతి కల్పించడం, స్వల్ప వ్యాయామం చేయించడం, మలబద్ధకం రాకుండా పీచుపదార్థాలు తినిపించడం చేయాలి.

పిల్లల్లో సమస్యలు ఇవీ...

* 2-3 గంటలసేపు ఒకేచోట స్థిమితంగా కూర్చోలేకపోతున్నారు.

* రాసే అలవాటు తప్పిపోయింది.

* ఒక విషయంపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. తరచూ ధ్యాస మళ్లిపోతోంది.

* పరీక్ష అంటేనే వణికిపోతున్నారు. అది రాయనవసరం లేకుండా తప్పిపోతే బాగుండునన్నంతగా భయపడుతున్నారు.

* చదివిన విషయాలను గుర్తుపెట్టుకోలేకపోతున్నారు.

* ముందు రెండు తరగతుల్లో నేర్చుకోవాల్సిన ప్రాథమిక పరిజ్ఞానాలను గ్రహించలేకపోయారు. ఫలితంగా పై తరగతిలో అయోమయానికి గురవుతున్నారు.

* ప్రత్యేకించి కొన్ని సబ్జెక్టుల విషయంలో విపరీతంగా భయపడుతున్నారు.

సానుకూల దృక్పథంతో ఆత్మవిశ్వాసం..

రీక్షలు బాగా రాయగలమని విద్యార్థులు తమకు తాముగా సానుకూల దృక్పథం అలవరచుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానికి తగ్గట్టుగా సిలబస్‌ను విభజించి చదువుకోవాలి. క్లిష్టమైన సబ్జెక్టులను రోజూ అరగంట లేదా గంటసేపు చదివితే పట్టుసాధించే వీలుంటుంది. చదువుకునేటప్పుడు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. వేర్వేరు చోట్లకు మారకుండా రోజూ ఒకేచోట కూర్చుని చదువుకోవాలి.- ఆరె అనిత, మనస్తత్వ విశ్లేషకురాలు

సమస్యలను ఎక్కువగా.. సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు..

పిల్లలు పరీక్షలను అసాధారణ విషయంగా భావిస్తున్నారు. పరీక్షలనేసరికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, నరాల బలహీనత, అలసట వంటివి వస్తున్నాయి. దీన్ని సైకోసొమటైజేషన్‌ అంటారు. నిర్దేశిత సమయం లక్ష్యంగా పెట్టుకుని కుదురుగా కూర్చోవడం సాధన చేయాలి. వారి ధ్యాస మళ్లుతుంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తం చేస్తుండాలి. గోడవైపు తిరిగి చదువుకుంటే, ఇతర అంశాలపై దృష్టి మరలే అవకాశాలు తగ్గుతాయి.

* కొందరు విద్యార్థులు పరీక్షను ఎక్కువగా ఊహించుకుంటూ.. తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏదైనా సబ్జెక్టులో ఉత్తీర్ణులు కాలేకపోయినా మరోసారి రాసుకోవచ్చని గ్రహించాలి. దాని గురించి భయపడుతూ, బాగా రాయగలిగిన మిగిలిన సబ్జెక్టులను చేజార్చుకోకూడదు.

* పాఠ్యాంశాలను గుర్తు పెట్టుకోవడానికి, చదవడం, పదేపదే పునశ్చరణ (రీడ్‌, రివైజ్‌) వంటి పద్ధతులను అనుసరించాలి. - డాక్టర్‌ గీత చల్లా, మనస్తత్వ విశ్లేషకురాలు

ఇవీ చూడండి..

గ్రూపు-​ 1 అభ్యర్థులకు వారి నుంచి గట్టి పోటీ.. కారణాలివే.!

సన్నీ లియోనీ ఫ్యాన్స్​కు బంపర్​ ఆఫర్​.. చికెన్​ కొంటే డిస్కౌంట్​

ABOUT THE AUTHOR

...view details