Antiques Collecting Person: సికింద్రాబాద్ లోతుకుంటకు చెందిన ఈయన పేరు వై. కృష్ణ మూర్తి. వృత్తిరీత్యా అనేక దేశాలు, రాష్ట్రాలు తిరిగిన ఆయన.. అక్కడి ప్రజలు వాడిన పురాతన వస్తువుల్ని సేకరించడం అలవాటుగా మార్చుకున్నారు. కృష్ణ మూర్తి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా సోమేశ్వరం. పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలో బాగ్దాద్, ఈజిప్ట్ దేశాలతో పాటు గోవా, పశ్చిమబంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పని చేశారు. పురాతన వస్తువుల ప్రాశస్త్యం గురించి తన తల్లి దగ్గర నేర్చుకున్న ఆయన.. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వీలైనన్ని పురాతన వస్తువుల్ని సేకరించి భావితరాలకు తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నారు. 82 ఏళ్ల వయస్సు వచ్చే వరకు సుమారు 900 పురాతన వస్తువుల్ని సేకరించారు.
Antiques Collecting Person: అతని ఇల్లే మ్యూజియం.. కనువిందు చేస్తున్న పురాతన వస్తువులు - 900 వస్తువులు సేకరించిన కృష్ణమూర్తి
Antiques Collecting Person: ఆ ఇల్లు ఓ మ్యూజియాన్ని తలపిస్తుంది. సుమారు 900 పురాతన వస్తువులు కనువిందు చేస్తాయి. చిన్నప్పటి నాన్నమ్మలు వాడిన వస్తువులు.. వండిన పాత్రలు.. రాగి గ్లాసులు.. రాతి పరికరాలు ఇలా ఎన్నో కనువిందు చేస్తాయి. 40 ఏళ్లుగా ఒక్కో వస్తువుని సేకరిస్తూ తన ఇంటిని ఓ ప్రదర్శనశాలగా మార్చేశారు.
విదేశాల నుంచి తెచ్చిన పురాతన వస్తువులు
బాగ్దాద్ నుంచి తీసుకొచ్చిన.. టీ’ తయారు చేసే సమావర్.. తాళపత్ర గ్రంథాలు రాసే పరికరం గంటం.. అరుదైన గంగాళాలు, విక్టోరియా మంచం, గోవా పాలకులు 5వ జార్జి కుర్చీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. పూర్వ కాలంలో చాలా మంది బియ్యాన్ని ఇత్తడి పాత్రల్లో వండేవారు. కంచుపాత్రల్లో పప్పులు వండేవారు. రాగిపాత్రల్లో నీరు తాగేవారు. ఇలాంటి జీవన విధానాన్ని అవలంబించి వారు రోగనిరోధకశక్తిని పెంపొందించుకుని.. అనారోగ్యం బారిన పడకుండా ఉన్నారని.. అలాంటి పురాతన జీవనశైలిని భావితరాలకు అందించాలన్నదే తన లక్ష్యం అంటున్నారు కృష్ణ మూర్తి. పాత తరం వస్తువుల ఆవశ్యకతను.. నేటి తరానికి తెలియచెబుతూ.. కృష్ణమూర్తి చేస్తున్న స్వచ్ఛంద సేవను పలువురు అభినందిస్తున్నారు.