కరోనా వైరస్ చికిత్సకు యాంటీబాడీలను వినియోగించవచ్చని అధ్యయనాలు నిరూపిస్తున్న నేపథ్యంలో వీటి తయారీకి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), సీసీఎంబీ, విన్స్ బయోప్రొడక్ట్స్ కంపెనీ చేతులు కలిపాయి. ఈ మేరకు సీసీఎంబీ, హెచ్‌సీయూతో విన్స్ బయోప్రొడక్ట్స్ కంపెనీ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, హెచ్‌సీయూ రిజిస్ట్రార్ సర్దార్‌సింగ్, విన్స్ సీఈవో సిద్ధార్థ్ ఈ మేరకు పత్రాలపై సంతకం చేశారు. తాజా ఒప్పందంలో భాగంగా సీసీఎంబీ తరఫున వైరస్ కల్చర్‌ను అందిస్తారు. హెచ్‌సీయూ సాంకేతికతను సమకూరుస్తుంది.
గుర్రాలలో యాంటీబాడీస్
అచేతన కరోనా వైరస్‌ను ఉపయోగించి గుర్రాలలో యాంటీబాడీస్‌ను వృద్ధిచేస్తారు. వాటిని శుద్ధి చేసి కరోనా చికిత్సకు అందిస్తారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతోనే భారీ మొత్తంలో యాంటీబాడీస్‌ను తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. హెచ్‌సీయూలోని పరిశోధక బృందానికి యానిమల్ బయోటెక్నాలజీ ఆచార్యుడు డాక్టర్ నూరుద్దీన్ ఖాన్ నాయకత్వం వహిస్తారు. సీసీఎంబీ తరఫున ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణన్ హరినివాస్, విన్స్ కంపెనీ తరఫున డాక్టర్ కృష్ణమోహన్ భాగస్వాములవుతారు.