జనసంద్రమైన గొల్లగట్టు - durajpally
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఘనంగా సాగుతోంది. ఉత్సవాల మొదటి రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఓ లింగా... నామస్మరణతో గుట్ట పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. గుట్ట చుట్టూ ఎటు చూసినా గుడారాలే దర్శనమిచ్చాయి.
భక్తుల జయజయధ్వానాలు, సంప్రదాయ డోలు, వీర్నాల వాయిద్యాలు, పొట్టేళ్ల గిరి ప్రదక్షిణలతో... గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతోంది. లింగమంతుల స్వామి, చౌడమ్మదేవి దర్శనానికి వేలాది జనం తరలివచ్చారు. సంప్రదాయ వాయిద్యాలతో యాదవులు ప్రదర్శన... భక్తిభావాన్ని చాటింది. ప్రధాన ఆలయం చుట్టూ పొట్టేళ్లతోప్రదక్షిణలు చేసి నైవేద్యంగా సమర్పించారు.
ఆదివారం అర్ధరాత్రి తర్వాత దేవరపెట్టే గుట్టకు చేరుకుంది. హక్కుదారులు ఇలవేల్పులకు బోనం సమర్పించాక... భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. గుట్ట చుట్టూ ఎటు చూసినా భక్తుల గుడారాలే కనిపించాయి. భక్తుల్ని నియంత్రించేందుకు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భక్తులు వచ్చిన ప్రైవేటు వాహనాలతో పరిసరాలు నిండిపోయాయి. సూర్యాపేట కలెక్టర్ కాలినడకన తిరుగుతూ సౌకర్యాలు పర్యవేక్షించారు.మంత్రి జగదీశ్ రెడ్డితోపాటు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ లింగమంతుల స్వామి, చౌడమ్మదేవిని దర్శించుకున్నారు.