ఎన్నో వ్యయ ప్రయాసలతో హైదరాబాద్ వాసులకు జలమండలి మంచినీటిని అందిస్తోంది. సుమారు 200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి, కృష్ణా జలాలను తీసుకొస్తోంది. ప్రతి వెయ్యి లీటర్లకు రూ. 47 ఖర్చు చేస్తూ... 214 కోట్ల 76 లక్షల లీటర్లతో రోజూ కోటి మందికి పైగా జనాభా దాహార్తిని తీరుస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో 37 శాతం లెక్కలోకి రాకుండా పోతోంది. ప్రజలు నీటి వృథాతో పాటు... కొందరు అక్రమంగా నీటి కనెక్షన్లను ఉపయోగిస్తున్నారు. ఈ వృథా కారణంగా జలమండలికి ప్రతినెలా సుమారు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించిన జలమండలి.... అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది.
వీడీఎస్ ద్వారా కనెక్షన్..
గతంలో అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తిస్తే.... మూడేళ్ల మంచినీటి బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్ ఛార్జీలు జరిమానాగా విధించేవారు. కానీ ఎలాంటి జరిమానాలు లేకుండా...స్వయంగా వివరాలు వెల్లడించే పథకం-వీడీఎస్ ద్వారా నల్లా కనెక్షన్ క్రమబద్ధీకరణకు జలమండలి అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు 90 రోజులపాటు వీడిఎస్ను అమలు చేయనున్నారు. అక్రమ కనెక్షన్లు ఉన్న యజమానులు జలమండలి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్రమబద్ధీకరణ ఛార్జీలతో పాటు ఒకనెల నల్లా బిల్లు చెల్లిస్తే సరిపోతుందని జలమండలి అధికారులు తెలిపారు.