Hyderabad Terror conspiracy Case Updates: లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ప్రోద్బలంతో హైదరాబాద్‌లో గతేడాది దసరా రోజున వరుస పేలుళ్లతో నరమేధానికి పథక రచన జరిగింది. అబ్దుల్ జాహెద్, మహమ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూక్ ఈ మారణహోమం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న నగర సీసీఎస్, సిట్ పోలీసులు గతేడాది అక్టోబర్ 2న ముగ్గురినీ అరెస్టు చేసి కుట్రను భగ్నం చేశారు. నిందితుల నుంచి నాలుగు చైనా గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరింత సమాచారం రాబట్టారు.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అబ్దుల్ జాహెద్ 2005లో టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై బాంబు దాడి కేసులో అరెస్టై 2017 ఆగస్టు 2న విడుదలైనట్లు విచారణలో తెలుసుకున్నారు. ఆ తర్వాతా పంథా మార్చుకోని జాహెద్.. హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రకు పథక రచన చేసినట్లు తెలిపారు. తన విధ్వంస పథకానికి తాజాగా అరెస్టయిన అబ్దుల్ కలీమ్ సహకారం తీసుకున్నాడు. వీరితో పాటు అదిల్ అఫ్రోజ్, సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫరూఖ్, అబ్దుల్ రవూఫ్, వాజిద్ ఖాన్, ఇర్ఫాన్, ఉమర్ సుబ్రమణ్యంలను నియమించారు. ఈ పథకం అమలుకు పాకిస్థాన్ నుంచి వచ్చే హవాలా డబ్బు చేరవేసే బాధ్యతను కలీమ్ తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Hyderabad terror conspiracy case: దసరా రోజు పేలుళ్ల కోసం చైనాలో తయారైనా 86పీ మిలిటరీ గ్రనేడ్లను కశ్మీర్ ద్వారా భారత్‌కు చేర్చారు. పాకిస్థాన్‌లోని మాజిద్.. వాట్సాప్ ద్వారా గ్రనేడ్లు ఉంచిన ప్రాంతం ఫొటోలు జాహెద్‌కు పంపాడు. 2022 సెప్టెంబరు 28న మాజిద్ ఆదేశాలతో సమీయుద్దీన్ ఎన్‌ఫీల్డ్ వాహనంపై మనోహరాబాద్ టోల్‌ప్లాజా(జాతీయ రహదారి-44) వద్దకు బయల్దేరాడు. మార్గమధ్యలో మేడ్చల్ వద్ద చేతి సంచి కొన్నాడు. మనోహరాబాద్ సమీపంలోని డెడ్‌డ్రాప్ దగ్గర నాలుగు గ్రనేడ్లను నగరానికి తీసుకొచ్చాడు. సమీయుద్దీన్, మాజ్ చెరో గ్రనేడ్ తీసుకున్నారు. రెండు జాహెద్‌కు అప్పగించాడు. సమావేశాలు, ఉత్సవాలు లక్ష్యంగా వాటిని విసరాలన్నది కుట్ర.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సమీయుద్దీన్, అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫరూఖ్‌ను అరెస్టు చేశారు. చైనా మేడ్ మిలటరీ గ్రనేడ్లు, సుమారు రూ.20 లక్షల హవాలా సొమ్ము, జాహెద్, మాజిద్ మధ్య సెల్‌ఫోన్ సంభాషణలు సేకరించారు. గ్రనేడ్లు తీసుకెళ్లే సమయంలో సైదాబాద్-మనోహరాబాద్ వరకు 60 కిలోమీటర్ల మార్గంలో 10 సీపీ ఫుటేజీలు సేకరించారు.