తెలంగాణ

telangana

ETV Bharat / state

Hussen sagar: హుస్సేన్‌సాగర్‌ వద్ద వాక్​ వే.. ఆకాశానికి హైవే..! - సాగర్

Hussen sagar:హైదరాబాద్​లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. పర్యాటకుల కోసం విదేశాల్లో మాదిరిగా ఆకట్టుకునేలా మరో నిర్మాణానికి జీహెచ్​ఎంసీ సిద్ధమైంది. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ వద్ద ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించనున్నారు.

Hussen sagar:
హైదరాబాద్​లో మరో అద్భుతం

By

Published : Jan 22, 2022, 5:27 AM IST

Updated : Jan 22, 2022, 9:39 AM IST

Hussen sagar: రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెన హుస్సేన్‌ సాగర్‌ చెంతనా రాబోతోంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది ఆఖరు నాటికి నెక్లెస్‌ రోడ్డులోని వీపీ ఘాట్‌ వద్ద ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై తేలియాడే వంతెన ఉంది. అక్కడ ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో అదొకటిగా నిలుస్తోంది.

నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే నదిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని తీర్చిదిద్దిన విధానం చూస్తే... ఇంజినీరింగ్‌ అద్భుతం కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. మన వద్ద కూడా దుర్గం చెరువుపై ఇలాంటి సాంకేతికతను ఉపయోగించి వంతెన నిర్మించిన విషయం తెలిసిందే.

ఇంతకంటే అత్యాధునిక సాంకేతికతతో మోస్క్వా నదిపై తేలాడే వంతెనను అందుబాటులోకి తెచ్చారు. దీని నిర్మాణంలో పారదర్శకమైన గాజును వినియోగించారు. ఫలితంగా వంతెనపై నిల్చొని కిందకు చూస్తే... నది అలలు, అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. వంతెన డెక్‌ మొత్తం పొడవు 244 మీటర్లు. ఒకేసారి వంతెనపై 2400 మంది వరకు నిల్చొని నది అందాలతో పాటు జుర్యాడే పార్కు, రెడ్‌ స్క్వేర్‌ కళా చిత్రాలను తనివి తీరా చూడవచ్చు. నెక్లెస్‌ రోడ్డు వద్ద హుస్సేన్‌ సాగర్‌పై ఇలాంటి వంతెను వస్తే... హైదరాబాద్‌ పర్యాటక ముఖ చిత్రమే మారిపోనుంది. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్డును ఏటా లక్షలాది మంది వీక్షిస్తుంటారు. త్వరలో ట్యాంక్‌బండ్‌ వద్ద నైట్‌ బజార్‌ రానుంది. ఈ తేలియాడే వంతెనతో సాగర్‌ అందాలు ఇనుమడించనున్నాయి. గతంలో ట్యాంక్‌బండ్‌పై లండన్‌ ఐ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు చేసినా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. అదే తరహాలో మరో ప్రాజెక్టు రూపకల్పనకు అడుగులు పడుతుండటంతో ఆసక్తి నెలకొంది.

Last Updated : Jan 22, 2022, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details