తెలంగాణ

telangana

ETV Bharat / state

Krishna Board: కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ - తెలంగాణ ప్రభుత్వం వార్తలు

krnb
krnb

By

Published : Jul 5, 2021, 2:22 PM IST

Updated : Jul 5, 2021, 4:46 PM IST

14:21 July 05

కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ

కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేసి ఈనెల 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) కోరింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Rajath Kumar) బోర్డు ఛైర్మన్​కు లేఖ రాశారు. ఏపీ ఈఎన్సీ (Ap Enc) లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 9న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బోర్డు సభ్య కార్యదర్శి తెలిపారని... తెలంగాణ ఈఎన్సీ పలుమార్లు లేవనెత్తిన అంశాలను అందులో పొందుపర్చలేదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆరు అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించాలని తెలంగాణ భావిస్తోందన్న రజత్ కుమార్... ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల వినియోగ నిష్పత్తిని పున:సమీక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కుడికాల్వ పనులను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలు... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బేసిన్ వెలుపలకు ఎక్కువ నీటిని తరలించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని పేర్కొన్నారు.

లెక్కించాలి...

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతుల నేపథ్యంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీల నీటిని కేటాయించాలని, తాగునీటి కోసం తీసుకునే జలాలను 20 శాతం మాత్రమే లెక్కించాలని రజత్​ కుమార్ అన్నారు. బోర్డు కేటాయింపుల్లో తెలంగాణ వినియోగించకుండా మిగిల్చిన నీటిని లెక్కించాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై బోర్డులో చర్చించాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్​కు నీటిని తరలించేందుకే శ్రీశైలం ప్రాజెక్టుకు 1963లో ప్రణాళికా సంఘం అనుమతించిందని... కృష్ణా జలవివాదాల మొదటి ట్రైబ్యునల్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని రజత్ కుమార్ లేఖలో వివరించారు.  

ఎత్తిపోతలే కీలకం...

తెలంగాణలో సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాలే కీలకమని, ఇందుకు చాలా పెద్దమొత్తంలో విద్యుత్ అవసరమన్నారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తితో సాగర్​లోకి తగిన నీరు చేరుతుందని... తద్వారా తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీరతాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న ఏపీ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. వివిధ అంశాల తీవ్రత దృష్ట్యా త్రిసభ్య కమిటీ సమావేశం కాకుండా పూర్తి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు, ఇంజినీర్లు సంబంధిత పనుల్లో బిజీగా ఉన్నారని... ఈనెల 20 తర్వాత రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న రోజు బోర్డు పూర్తి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు ఛైర్మన్​కు రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.  

ఇదివరకే లేఖ...  

తెలంగాణ ప్రభుత్వం తన హక్కుగా వచ్చిన నీటితోనే చట్టం, ట్రైబ్యునల్ ఆదేశాలకు లోబడి శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... ఇందులో ఆంధ్రప్రదేశ్​కు ఎలాంటి అభ్యంతరాలు అక్కర్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఓ అభిప్రాయానికి రావాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఇదివరకే కోరింది. 

ఇదీ చూడండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

Last Updated : Jul 5, 2021, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details