Letter TO Government A krishna River Management Board: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఖరారు నేపథ్యంలో తాము కోరిన సమాచారం, వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. రూల్ కర్వ్స్ ఖరారు కోసం తాము గతంలో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, ఇతర వివరాలు ఇవ్వాలని కోరామని... వాటి కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపారు.
కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ - Hyderabad Latest News
16:57 August 27
కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం మరో లేఖ
మే నెలలో జరిగిన రెండో ఆర్ఎంసీ సమావేశంలో జరిగిన చర్చల సారాంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. కృష్ణా జలాల మొదటి ట్రైబ్యునల్, వివిధ ప్రాజెక్టుల కాంపోనెంట్ల టీఏసీలు, చెన్నై తాగునీటి సరఫరాకు సంబంధించిన అంతర్ రాష్ట్ర ఒప్పందాలను పరిగణలోకి తీసుకొనే రూల్ కర్వ్స్ రూపొందించాలని పేర్కొన్నారు. రూల్ కర్వ్స్ తయారు కోసం 37 ఏళ్ల ఇన్ ఫ్లో వివరాలు అవసరమని... శ్రీశైలం ఎఫ్ఆర్ఎల్, ఎండీడీఎల్ పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో రూల్ కర్వ్స్ ఖరారు కోసం తాము కోరిన సమాచారం, వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని తెలంగాణ కృష్ణాబోర్డును మరోమారు కోరింది. తద్వారా రూల్ కర్వ్స్ ముసాయిదాపై తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంటుందని పేర్కొంది. వచ్చే నెల రెండో తేదీన ఆర్ఎంసీ సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఈఎన్సీ బోర్డుకు రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇవీ చదవండి:జలాశయాల పర్యవేక్షణ కమిటీ భేటీ... హాజరుకాని తెలంగాణ