తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖలో మరో భారీ భూ కుంభకోణం.. హయగ్రీవ భూముల్లో రియల్ మాయ

Another Huge Land Scam In Visakhapatnam: విశాఖలో అధికార పార్టీ నాయకులు మరో భారీ భూ కుంభకోణానికి తెగబడ్డారు. వృద్దుల పేరుతో ప్రభుత్వం నుంచి తీసుకున్న హయాగ్రీవ భూముల్లో రియల్ దందా నడుపుతున్నారు. 250కోట్ల రూపాయల విలువైన 12.51ఎకరాల భూమిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని..అక్కడ అవకతవకలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చినా, ప్రభుత్వంలో ఉలుకుపలుకు లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇందులో సూత్రధారి కావడం వల్లే కలెక్టర్‌ చెప్పినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

visakhapatnam
visakhapatnam

By

Published : Oct 20, 2022, 11:09 AM IST

Another Huge Land Scam In Visakhapatnam: కలెక్టర్‌ జిల్లా స్థాయిలో సర్వాధికారి. భూముల విషయంలోనైతే మరింత విస్తృతాధికారం. అలాంటి కలెక్టర్‌, ప్రభుత్వ భూములు దోపిడీకి గురవుతున్నాయని.. అవకతవకలు జరుగుతున్నాయని, కేటాయింపులు రద్దు చేయాలని నివేదిస్తే..చిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? వెంటనే కదులుతుంది.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కానీ అధికార పార్టీ నాయకుల అక్రమాలకు, లెక్కలేనన్ని భూదందాలకు కేంద్రమైన విశాఖలో అవేమీ జరగడంలేదు. అక్కడ 250 కోట్ల రూపాయలకుపైగా విలువ గల 12.5 ఎకరాల భూమి నిబంధనలకు విరుద్ధంగా రియల్‌ వ్యాపారానికి కరిగిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.

ఆ భూ దందా గురించి జిల్లా కలెక్టర్‌ 9నెలల క్రితమే లేఖ రాసినా పట్టించుకోవటం లేదు.వృద్ధుల కోసం ఆశ్రమం, అనాథ శరణాలయం ఉచితంగా నిర్మించడంతో పాటు.. వృద్ధులు సౌకర్యంగా నివసించేందుకు వీలుగా కాటేజీలు నిర్మిస్తామంటూ విశాఖలో 2008లో హయగ్రీవ ఫార్స్మ్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది.

ఎకరం కోటిన్నర చొప్పున కేటాయించవచ్చని అప్పటి కలెక్టర్‌ సిఫారసు చేయగా.. వృద్ధులు, అనాథలకు కాటేజీలు కట్టడం అనే కారణం చూపించి.. ఎకరం 45 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు అప్పటి YS ప్రభుత్వం నిర్ణయించి, 2008 జూన్‌ 12న భూమి కేటాయించింది. అందులో 60 శాతం భూమిని స్థలాలుగా మార్చి వృద్ధులకు విక్రయించి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాటేజీలు నిర్మించాలి.

30 శాతం భూమిని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ఈ లెక్క ప్రకారం హయగ్రీవ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాల్లో 6వేల 054.80 చదరపు గజాల్లో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మించాలి. 18వేల 164.50 చదరపు గజాల్లో మౌలిక వసతుల కల్పించాలి. 36వేల 329.10 చదరపు గజాల్లో కాటేజీల నిర్మాణం చేపట్టాలి.

కానీ..ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించకపోగా, వృద్ధులకు కాటేజీలు నిర్మించాల్సిన 36వేల329.10 చదరపు గజాల్లోను 32వేల 857 చదరపు గజాల్ని ఇప్పటికే అమ్మేసిందని, అది స్థిరాస్తి వ్యాపారం తప్ప, మరొకటి కాదని భూ కేటాయింపు రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున జనవరిలో నివేదిక పంపారు.

అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీన్నిబట్టే అక్రమార్కులకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని అర్ధమవుతోంది. రెవెన్యూశాఖ ఉన్నతాధికారుల్లో కూడా కనీస స్పందన లేదు.విశాఖ భూ అక్రమాలపై పోరాడుతున్న జనసేనకు కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ హయగ్రీవ అక్రమాలపై కోర్టులో కేసు వేశారు.

దానిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విషయం కోర్టుకు వెళ్లినా..ప్రభుత్వం చోద్యం చూస్తుండటానికి అవి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి చేతుల్లోకి వెళ్లడమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

హయగ్రీవ సంస్థకు ఇచ్చిన భూమి ప్రస్తుతం వైకాపా నేతల పరమైంది. విశాఖకు చెందిన ఆడిటర్, విశాఖ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు‍(జీవీ) దీనికి ప్రధాన సూత్రధారని, ఆయన సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆ భూమికి జీవీనే, జీపీఏ హోల్డర్‌. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తే కోర్‌ క్యాపిటల్‌ ఏర్పాటవుతుందని భావిస్తున్న ప్రాంతానికి అత్యంత సమీపంలో ఆ భూములున్నాయి. అప్పట్లో ఎకరం 45 లక్షల రూపాయల చొప్పున ఆ సంస్థకు ప్రభుత్వం భూమి కేటాయించగా ఇప్పుడక్కడ ఎకరం విలువ కనీసం 20 కోట్ల రూపాయలు ఉంది.

హయగ్రీవ సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ చిలుకూరి జగదీశ్వరుడి అధీనంలో ఉన్న ఆ భూమి.. వైకాపా అధికారంలోకి వచ్చాక జీవీ చేతుల్లోకి వెళ్లింది. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకీ దానిలో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. జీవీ తదితరులు తనను భయపెట్టి స్వాధీనం చేసుకున్నారని కొంతకాలం క్రితం జగదీశ్వరుడు సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టారు.

గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)తో పాటు, స్థానిక వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేరునూ ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు జీవీ, జగదీశ్వరుడు అంతా కలిసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కలిసే భూమి పంచేసుకుంటున్నారు.

విశాఖలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వైకాపా నేతల చేతుల్లోకి ఎలా చేరాయో.. హయగ్రీవ సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ జగదీశ్వరుడు అప్పట్లో వీడియోలో బయటపెట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలోని ఎన్‌సీసీ భూములు, బేపార్క్, రాడిసన్‌ హోటల్‌ చేతులు మారాయని జీవీ తనతో చెప్పారని, హయగ్రీవ ఫార్మ్స్‌ భూమి కూడా చేతులు మారుతుందని బెదిరించారని తెలిపారు.

వాళ్లు ఆ ప్రాజెక్టులో ఉంటే విజయసాయిరెడ్డి దాని జోలికి రారని, ప్రాజెక్టును జీవీకి, ఎంపీకి ఇచ్చేస్తే కాపాడుతామని చేస్తామని చెప్పారు. జగన్, ధనుంజయరెడ్డిల పెట్టుబడులు తన దగ్గరున్నాయని, తాను చాలా శక్తిమంతుడినని జీవీ ఇన్‌డైరెక్ట్‌గా నన్ను బ్లాక్‌మెయిల్‌ జేశారని పేర్కొన్నారు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల విశాఖలో విలేఖరుల సమావేశం నిర్వహించినప్పుడు కొందరు విలేఖరులు హయగ్రీవ భూముల గురించి ప్రశ్నించారు. వాటిలో మీ పార్టీ నాయకుల ప్రమేయం ఉంది కదా.. అని ఒక విలేఖరి ప్రస్తావించగా, ఆయన నర్మగర్భంగా నవ్వుతూ.. ‘నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఆ ప్రశ్న అడిగారని నాకు తెలుసు.

అయినా మా పార్టీ వాళ్లను మేం ప్రొటెక్ట్‌ చేసుకోవాలి కదా!’ అని వ్యాఖ్యానించారు. హయగ్రీవ సంస్థకు భూకేటాయింపులు రద్దు చేయమని కలెక్టర్‌ నివేదిక పంపినట్టు తనకు తెలియదన్నారు. నిజంగానే అవి వృద్ధులకు కేటాయించిన భూములయి, అక్రమాలు జరిగినట్టు కలెక్టర్‌ నివేదిక పంపి ఉంటే.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని తెలిపారు.

ఆ భూమిలో ఏమైనా కట్టుకునేదానికి అనుమతులు వచ్చాయా?’ అని విలేఖరుల్ని ఆయన ఎదురు ప్రశ్నించారు. అనుమతులు రాకుండానే పనులు చేసేస్తున్నారని ఒక విలేఖరి చెప్పగా.. ‘మరి మీ పత్రికలో అన్నీ వస్తాయి. అది మాత్రం రాదేం?’ అని వ్యాఖ్యానించారు.

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details