తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. జీనోమ్ వ్యాలీలో (Genome Valley) కంపెనీ భారీ ల్యాబ్ స్పేస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. సుమారు సుమారు రూ.740కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ల్యాబ్ విస్తీర్ణంలో సుమారు 10 లక్షల చదరపు అడుగుల ఆక్యుపెన్సీతో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ భారత ప్రతినిధులు.. చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హాతో కూడిన బృందం మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ప్రకటించారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో ఒక ప్రముఖ కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో మొదటిసారిగా ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఇవాన్ హో కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (ktr) అన్నారు. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రంగ పరిశోధన అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని... తాజాగా ఈ పెట్టుబడి ద్వారా ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ రంగ విజన్‌కు మరింత ఊతం లభిస్తుందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా జీనోమ్ వ్యాలీలో మరింత లేబొరేటరీ స్పేస్ పెరగుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనితో పాటు రానున్న కాలంలో పరిశోధన, అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ అనుబంధ మౌలిక వసతులు మరింతగా పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.