తెలంగాణ

telangana

ETV Bharat / state

Medical Colleges: రాష్ట్రంలో మరో నాలుగు... ప్రభుత్వం కీలక నిర్ణయం - సీఎం కేసీఆర్ వార్తలు

వైద్యశాఖ తనవద్దే ఉండడంతో.. దాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రణాళికలు రూపొందించాలని వైద్యవర్గాలకు సూచించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి అనుమతి కోరుతూ... జాతీయ వైద్య కమిషన్‌కు వచ్చే ఏడాది దరఖాస్తు చేయనున్నారు.

medical-colleges
వైద్య కళాశాలలు

By

Published : Sep 14, 2021, 6:51 AM IST

రాష్ట్రంలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. వికారాబాద్‌, సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో వీటిని నెలకొల్పాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. 2023-24 సంవత్సరానికి ఈ నాలుగింటికి అనుమతి కోరుతూ జాతీయ వైద్య కమిషన్‌కు వచ్చే ఏడాది దరఖాస్తు చేయనున్నారు. ఆదివారం నిర్వహించిన వైద్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. వీటితోపాటు ఇంకో 4 వైద్యకళాశాలలనూ నెలకొల్పడానికి ఇప్పటినుంచే సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారని తెలుస్తోంది. ఆ నాలుగింటి పేర్లను ప్రస్తావించకపోయినా.. మరో ఏడాది గడువు ఉండడంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లేని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడంపై ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం వైద్యశాఖ తన వద్దే ఉండడంతో..

వైద్యశాఖ ముంఖ్యమంత్రి వద్దే ఉండడంతో... దానిని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని అంశాలను పరిశీలించాలనీ, ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ ఇంత మంచి అవకాశం రాదనీ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ నీటి పారుదల, వ్యవసాయంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించానని, ఇకనుంచి విద్య, వైద్యంపై దృష్టిపెడతానని.. అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 2022-23 వైద్యవిద్య సంవత్సరానికి రాష్ట్రం నుంచి సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, రామగుండం(సింగరేణి)లో.. మొత్తం 8 ప్రభుత్వ వైద్యకళాశాలలను నెలకొల్పడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రామగుండం మినహా మిగిలిన వైద్యకళాశాలల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

త్వరలో సింగరేణి కళాశాలకూ పోస్టులను మంజూరు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఈ 8 కళాశాలలను వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో కళాశాలలో 150 చొప్పున మొత్తం 1200 వైద్య సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 9 ప్రభుత్వ వైద్యకళాశాలలుండగా.. వచ్చే రెండేళ్లలోనే వీటి సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:GOVT HOSPITALS: పల్లెకో ఆసుపత్రి.. వైద్యసేవల విస్తరణకు ప్రభుత్వ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details