తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఎంఎస్​ కుంభకోణంలో ఇంటి దొంగ గుట్టురట్టు - esi scam in hyderabad

బీమా వైద్య సేవల సంస్థ మందుల కొనుగోలు కుంభకోణంలో లెజెండ్‌ సంస్థ డొల్ల కంపెనీ వ్యవహారంలో హిమోక్యూ సంస్థ ఇంటి దొంగ పాత్రను అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. స్వీడెన్‌ కు చెందిన హిమోక్యూ సంస్థకు సంబంధం లేకుండా నకిలీ అధికార పత్రాన్ని సృష్టించడంలో ఆ సంస్థ రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్‌ కీలకంగా వ్యవహరించినట్టు అధికారుల విచారణలో బయటపడింది.

another culprit in esi scam
ఐఎంఎస్​ కుంభకోణంలో ఇంటి దొంగ గుట్టురట్టు

By

Published : Jan 2, 2020, 4:47 AM IST

Updated : Jan 2, 2020, 9:03 AM IST

ఐఎంఎస్​ కుంభకోణంలో ఇంటి దొంగ గుట్టురట్టు

బీమా వైద్య సేవల సంస్థ ఔషధాల కొనుగోలు కుంభకోణంలో భారీగా నిధుల మళ్లింపు జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ విచారణలో బయటపడింది. స్వీడెన్‌ కు చెందిన హిమోక్యూ సంస్థకు సంబంధం లేకుండా ఆ సంస్థ రీజినల్​ మేనేజర్​ వెంకటేశ్​ నకిలీ అధికార పత్రాన్ని సృష్టించినట్లు వెల్లడైంది. ఈ కేసులో కీలక నిందితుడు ఓమ్ని మెడి సంస్థ యజమాని శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జితో కలిసి వెంకటేశ్‌ కుట్ర పన్ని నిధులు కొల్లగొట్టినట్టు ఏసీబీ గుర్తించింది.

2017 నుంచే ప్లానింగ్

2017లో హిమోక్యూ ఏరియా మేనేజర్‌గా పనిచేసినప్పటి నుంచే వెంకటేశ్‌ ఈ కుట్రకు తెర లేపినట్టు తేలింది. తెల్ల రక్త కణాల సంఖ్య, శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని నిర్ధారించే పరీక్ష కిట్ల సరఫరా వ్యవహారంలో హిమోక్యూ సంస్థ తరఫున తెలంగాణ వ్యాప్తంగా అధీకృత పంపిణీదారు లెజెండ్‌ సంస్థ మాత్రమే అనేది ఆ నకిలీ పత్రం సారాంశం.

54 కోట్లు దండుకున్నారు

దాని ఆధారంగానే దేవికారాణి, పద్మ... లెజెండ్‌ సంస్థకు పరీక్ష కిట్ల కాంట్రాక్టు కట్టబెట్టారు. ఆ తర్వాత కృపా సాగర్‌రెడ్డి పేరిట సృష్టించిన లెజెండ్‌ సంస్థకు ఐఎంఎస్‌ నుంచి నిధులు మళ్లించారు. సొమ్ములు కొల్లగొట్టడంలో భాగంగా 11,800 వాస్తవ విలువ గల ఒక్కో కిట్‌ 36,800 రూపాయలకు కొన్నట్టు రికార్డులు సృష్టించడంతో పాటు... అసలు కొనకుండా బోగస్‌ రికార్డులు రూపొందించి 54 కోట్లు దండుకున్నారు.

రిమాండ్​లో నిందితులు

ఈ వ్యవహారంలో దేవికారాణి, పద్మ, బాబ్జీ, కృపాసాగర్‌రెడ్డి, లెజెండ్‌ ఉద్యోగి వెంకటేశ్వర్‌రావు, వెంకటేశ్‌పై కేసు నమోదైంది. బాబ్జీ, వెంకటేశ్‌ను అనిశా అధికారులు రిమాండ్‌కు తరలించారు. మరికొందరు ఐఎంఎస్‌ అధికారులతో పాటు ప్రైవేటు వ్యక్తుల పాత్ర పై లోతుగా ఆరా తీస్తున్నారు.

Last Updated : Jan 2, 2020, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details