తెలంగాణ

telangana

ETV Bharat / state

'వడదెబ్బతో నెలలో 17 మంది మృతి... మంగళవారం ఒక్కరోజే ఆరుగురు' - Telangana High Temperatures

High Temperatures in Telangana: రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడగాలులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పొడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు.

temperatures
temperatures

By

Published : May 4, 2022, 5:03 AM IST

High Temperatures in Telangana: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పొడిగాలులతో జనం అల్లాడిపోతున్నారు. పొలాల్లో పనిచేసే రైతు కూలీలు, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత నాలుగు వారాల్లో సుమారు 17 మంది వడదెబ్బతో కన్నుమూశారు. మంగళవారం ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అధికార యంత్రాంగం దృష్టికిరాని మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయని అంచనా. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఎండదెబ్బ బారినపడి చికిత్స కోసం చేరుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో 5-10 మంది వరకూ బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. స్వల్ప అస్వస్థతతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్న వారు వందల సంఖ్యలోనే ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఈ వేడి వాతావరణం, అకాల వర్షాలతో పంటలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. పూత, కాత, దిగుబడులు తగ్గుతున్నాయి. కూరగాయల సాగుపై ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోళ్ల, పాడి పరిశ్రమ కకావికలమవుతోంది. కోళ్లఫారాల నిర్వహణ కష్టమవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పక ఎండలో పనిచేసే కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, ట్రాఫిక్‌ పోలీసులు తదితరులతో పాటు ప్రతిఒక్కరూ వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ సూచిస్తోంది. వడదెబ్బనివారణకు అనుసరించాల్సిన విధానాలపై తాజాగా సూచనలు విడుదల చేసింది.

శరీర ఉష్ణోగ్రత పెరిగితే..

ఎండదెబ్బ (వడదెబ్బ) అంటే.. పరిసరాల్లో ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవడం. శరీరంలో వేడిని చల్లబరచడానికి చెమట పట్టే క్రమంలో కొన్నిసార్లు రక్తంలో ద్రవం ఎక్కువగా ఆవిరైపోతుంది. ఆ సమయంలో శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ కుప్పకూలి, చెమటపట్టడం ఆగిపోయి, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో 104 డిగ్రీలు కూడా దాటొచ్చు. దీంతో చర్మం పొడిబారుతుంది. రక్తపోటు తగ్గి కళ్లు మసకబారతాయి. నీరసంగా అనిపిస్తుంది. కొందరికి కాళ్లు లాగుతాయి. తలనొప్పి వస్తుంది. శరీరంలోని శక్తినంతా పీల్చేసిన అనుభవం కలుగుతుంది. ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాల బారినపడతారు. తలతిరగడం, మతికోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె లయ తప్పుతుంది. వడదెబ్బకు గురైన బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అనంతరం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి. వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే కోమాలోకి జారుకునే ప్రమాదముంది. శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల కిడ్నీలు, కాలేయం వంటివి దెబ్బతినే అవకాశాలూ ఉన్నాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతే మరణాలు సంభవిస్తాయి. చాలామంది బయట తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తారు. ఇంట్లో ఉన్నా వేడి గాలులు, ఉక్కపోతకు గురైనప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రతలు 104 డిగ్రీలు దాటుతుంటే వడదెబ్బకు గురైనట్లు అనుమానించాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

* ఇంట్లో ఉన్నా, బయట పనిలో ఉన్నా తప్పనిసరిగా గంట గంటకూ ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు లేదా ఓఆర్‌ఎస్‌ తాగాలి. లెక్కపెట్టుకొని మరీ రోజుకు కనీసం 5 లీటర్ల నీరైనా తాగాలి.

* ఎండలో పనిచేస్తున్నవారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలి.

* గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు లేదా ఏదైనా ఆచ్ఛాదన ధరించాలి.

* వేసవిలో శీతలపానీయాలు అంత మంచివి కాదు. వాటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగాలి.

* శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస ముక్కల్ని ఎక్కువగా తినాలి. దీనివల్ల శరీరానికి నీటితో పాటు పోషకాలు కూడా అందుతాయి.

* జీలకర్రను దోరగా వేయించి పొడిచేసుకొని.. నిమ్మరసంలో కలిపి తాగితే శరీరానికి శక్తి వస్తుంది.

ఇదీ చదవండి:'త్వరలో పాదయాత్ర చేపడతా.. దమ్ముంటే ఆపండి'

పారిశుద్ధ్య కార్మికుల కోసం చెన్నై ఐఐటీ విద్యార్థుల వినూత్న రోబో

ABOUT THE AUTHOR

...view details