ACB Annual Crime Report-2021 AP: ఆంధ్రప్రదేశ్‌లో లంచం తీసుకుంటూ అవినీతినిరోధక శాఖకు దొరికిన ప్రభుత్వోద్యోగుల్లో సగంమందికిపైగా రెవెన్యూ శాఖలో పనిచేసేవారే ఉన్నారని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. 2021లో మొత్తం 72 ట్రాప్ కేసులు నమోదవగా.. అందులో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు. లంచం తీసుకుంటూ దొరికిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్, హోం, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. మొత్తం ట్రాప్ కేసుల్లో 86.11 శాతం అంటే 62 కేసులు ఈ 5 శాఖల ఉద్యోగులపైనే నమోదయ్యాయి. ఈ ఏడాది లెక్కల్లో అత్యధికంగా విశాఖ జిల్లా చోడవరం మండలం తహసీల్దార్‌గా పనిచేసిన రవికుమార్.. రూ. 4 లక్షల 50 వేల తీసుకుంటూ అ.ని.శా.కు చిక్కారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తహసీల్దార్ నాగభూషణరావు.. రూ.4 లక్షలతో కంట పడ్డారు. భూముల మ్యుటేషన్, పొసెషన్ సర్టిఫికెట్, ఆన్‌లైన్‌లో భూముల వివరాల నమోదుకు రెవెన్యూ ఉద్యోగులు లంచాలు తీసుకున్నారు.
అత్యధికంగా ఆదాయానికి మించిన ఆస్తులు
ఈ ఏడాది నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో...అత్యధికంగా బీసీసంక్షేమశాఖ కార్పొరేషన్ ఎండీ నాగభూషణం దగ్గర.. రూ.10 కోట్ల 79 లక్షల విలువజేసే ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. ఏపీఈపీడీసీఎల్(APEPDCL) ఏఈ నాగేశ్వరరావు వద్ద రూ. 3 కోట్ల 82 లక్షల విలువైన అక్రమాస్తులు ఉన్నాయని తేల్చారు.