Annaram Saraswati Barrage Leakage :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజీ దిగువన సీపేజీ(బుంగలు) ఏర్పడ్డినట్లు అధికారులు గుర్తించారు. ఎండ్‌సీల్ ప్రాంతంలో పలు చోట్ల నీటి బుంగలు వచ్చాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే బ్యారేజీకి సంబంధించి బ్లాక్ బి-4లోని 38, 42 పియర్‌ల వద్ద వెంట్ ప్రదేశాలలో రెండు రోజుల క్రితం అవి ప్రారంభం అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
రెండు చోట్ల అవి ఎక్కువగా ఉండటంతో ఇంజినీర్లు తగిన చర్యలు చేపట్టారు. వాటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రింగ్‌బండ్ వేస్తున్నామని చెప్పారు. రెండు చోట్ల రెండు మూడు అంగుళాల మేర సీపేజీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇసుక తేలకపోవడంతో ప్రమాదం లేదని వారు వివరించారు. నాటు పడవల ద్వారా సీపేజీ ఏర్పడిన ప్రాంతాలకు చేరుకొని ఇసుక సంచులు, రాళ్లతో అడ్డుకట్ట వేశారు. సుమారుగా 2,000 బస్తాలను అలా వేసినా ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అధికారులు పనులను కొనసాగిస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం కూడా...
Seepage at Two Places in Annaram Barrage : ఇది పైపింగ్ ప్రారంభ దశని.. దీనిని గుర్తించకపోతే దిగువన ఇసుక క్రమంగా తరలి వెళ్తుందని డిజైన్లలో అనుభవం ఉన్న సీనియర్ ఇంజినీర్ తెలిపారు. పియర్స్ కుంగిపోవడం, నష్టం వాటిల్లడం జరుగుతుందని పేర్కొన్నారు. మేడిగడ్డలో ఇలాగే జరిగి ఉండొచ్చని అయితే అన్నారంలో వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రారంభించడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని ఆయన అన్నారు.
రెండు సంవత్సరాల క్రితం కూడా అన్నారంలో ఇలాంటి సమస్య వచ్చిందని.. అప్పుడు సీపేజీ ఎక్కువ ఉండటంతో పాటు కొద్దిగా ఇసుక కదలడం కూడా గుర్తించి వెంటనే కెమికల్ గ్రౌటింగ్ చేశామని సంబంధింత ఇంజినీర్లు తెలిపారు. ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చయిందని పేర్కొన్నారు. మరోవైపు నాలుగు రోజులుగా బ్యారేజీలో నీటి నిల్వను క్రమక్రమంగా తగ్గించారు.