డీజీపీగా మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవర్ని నియమిస్తారనే చర్చకు సర్కారు తెరదించింది. అంజనీకుమార్‌ను డీజీపీ(సమన్వయం)గా బదిలీ చేయడంతోపాటు ఆ హోదాలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధకశాఖ డీజీగా ఉన్నారు. ఆయనతోపాటు మరో ఆరుగురు అధికారులనూ బదిలీ చేసింది. ఏడేళ్లుగా రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేశ్ భగవత్‌ను సీఐడీ చీఫ్ (అదనపు డీజీ)గా నియమించింది. సీఐడీ చీఫ్‌గా పనిచేసిన గోవింద్‌సింగ్ నవంబరులో పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది.
ఈ విభాగం అదనపు బాధ్యతలను గతంలో ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డికి అప్పగించారు. ఆయన పదవీ విరమణ చేస్తుండటంతో ఆ స్థానంలో మహేశ్ భగవత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న దేవేందర్‌సింగ్ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా నియమించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను అవినీతి నిరోధక శాఖ(అనిశా) డీజీగా నియమించడంతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం శాంతిభద్రతల అదనపు డీజీగా ఉన్న జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీగా పనిచేస్తూ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగం అదనపు బాధ్యతలు చూస్తున్న సంజయ్‌కుమార్ జైన్‌ను..జితేందర్ స్థానంలో శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.
ఏపీ కేడర్ అధికారి.. జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్
* 1990 బ్యాచ్‌కి చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారి అంజనీకుమార్ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
* వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా తొలి పోస్టింగ్ పొందారు. 1992-94 మధ్య అక్కడ పనిచేశారు. తర్వాత మహబూబ్‌నగర్ ఓఎస్డీ, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు.
* 1998లో ఐక్య రాజ్య సమితి శాంతిపరిరక్షక దళానికి ఎంపికై బోస్నియా-హెర్జిగోవినాలో సంవత్సరంపాటు విధులు నిర్వర్తించారు.