తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాల ఆకలి తీర్చేది ఎవరు? - corona effect on animals

కరోనా ప్రభావంతో మూగజీవులు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో వీధి శునకాలు, ఆవులు, పిల్లులు, ఇతర జంతువులకు దాదాపుగా తిండి కరువైంది. పౌరులంతా ఇళ్లకే పరిమితమవడం, రహదారులు, వీధుల్లో ఆహార విక్రయ కేంద్రాలు మూతపడి ఈ దుస్థితి నెలకొంది.

Animals suffering with  food problem in hyderabad
వాటి ఆకలి తీర్చేది ఎవరు?

By

Published : Apr 6, 2020, 1:36 PM IST

ప్రస్తుతం మూగజీవుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో వీధి శునకాలు, ఆవులు, పిల్లులు, ఇతర జంతువులకు దాదాపుగా తిండి కరువైంది. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోనూ, బెంగళూరు నగరంలో మహానగరపాలిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇలాంటి జంతువులకు ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశాయి. భాగ్యనగరంలోనూ ఆ తరహా సహాయ కార్యక్రమాలు చేపట్టాలన్న డిమాండ్‌ జంతు ప్రేమికులు, వలంటీర్ల నుంచి వినిపిస్తోంది.

సుమారు పది లక్షల శునకాలు

హైదరాబాద్‌లో వీధి శునకాలు సుమారు పది లక్షలు ఉన్నాయి. పిల్లులు, పెంపుడు పక్షులు, వాటిని విక్రయించే దుకాణాలు సైతం గ్రేటర్‌లో భారీగానే ఉన్నాయి. ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు విధించిన ఆంక్షలతో ఆయా మూగజీవులన్నింటికీ ఆహారం లభించట్లేదు. చిరుతిళ్లు, మాంసం దుకాణాలు, హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు చెత్తకుప్పల్లో వేసే ఆహారమే వీధి శునకాలకు ప్రధాన వనరు.

మనుషులపై దాడి చేసే ప్రమాదం

నివాస సముదాయాల్లో జంతు ప్రేమికులు ఇచ్చే తిండి పరిమాణం తక్కువ ఉంటుంది. ఆంక్షల కారణంగా.. చెత్తకుప్పలకు ఆహార వ్యర్థాలు చేరట్లేదు. మాంసం దుకాణాల వ్యర్థాలు అరకొరగా మారాయి. అవి ఆకలితో రహదారులపై స్వైర విహారం చేస్తున్నాయి. దానికి తోడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు ఆకలి తోడైతే వీధి కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉందని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. వీధి శునకాలు, ఆవులు, ఇతర మూగజీవులకు ఉదయం, సాయంత్రం ఏదో రకమైన ఆహారాన్ని అందించడం మేలంటున్నారు.

పక్క రాష్ట్రాల్లో ఇలా..

ప్రజలను స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించిన సందర్భంగా.. ఒడిశా సర్కారు మూగజీవులకు తిండి అందించడంలో చొరవ చూపింది. సీఎం సహాయ నిధి నుంచి రూ.54లక్షలు విడుదల చేసింది. రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లు, 48 మున్సిపాలిటీలకు అందజేసింది. వాటిని ఖర్చు చేసి ఆయా పురపాలక సంస్థలు ఆహారం అందించాల్సి ఉంటుంది.

బృహత్‌ బెంగళూరు మహానగరపాలిక(బీబీఎంపీ) సైతం స్వచ్ఛంద సంస్థల అభ్యర్థన మేరకు ఎన్జీవోలతో కలిసి మూగజీవుల ఆకలి తీర్చేందుకు రంగంలోకి దిగింది. బీబీఎంపీని అధికారులు నాలుగు జోన్లుగా విభజించి, ఆయా జోన్లలో శునకాలు, ఇతర ప్రాణులకు ఆహార తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నిర్ణయం తీసుకోలేదు

జీహెచ్‌ఎంసీ ముఖ్య పశువైద్యాధికారి అబ్దుల్‌ వఖీల్‌ను వివరణ కోరగా.. బల్దియా పరిధిలోని జంతు పరిరక్షణ కేంద్రాల్లోని శునకాలకు, జంతువులకు మాత్రమే తాము ఆహారం అందిస్తున్నామని, వీధుల్లోని శునకాల గురించి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ముఖ్య పశువైద్యాధికారి


ఇవీ చూడండి:'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ABOUT THE AUTHOR

...view details