సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్య రంగ, మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సరం 50 కోట్ల రూపాయల ఖర్చుతో 80 కోట్ల చేప పిల్లలను రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.
ఇప్పటికే 57 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామని చెప్పారు. 2019-20 సంవత్సరంలో 15,175 నీటి వనరుల్లో 64 కోట్ల చేప పిల్లలు విడుదల చేసి.. 2.99 లక్షల టన్నుల మత్స్య సంపదను సృష్టించామని వెల్లడించారు. ఈ ఏడాది విడుదల చేస్తున్న చేప పిల్లలతో సుమారు 3.40 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు అదనపు ఆదాయాన్ని కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మంచినీటి రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ముషీరాబాద్, బేగంబజార్‌లోని హోల్ సేల్ చేపల మార్కెట్ల ద్వారా ప్రజలకు చేపలను విక్రయిస్తున్నామని చెప్పారు. ఇవే కాకుండా 1500 మంది రిటైల్ విక్రయదారుల ద్వారా చేపల విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు. డివిజన్‌కు ఒకటి చొప్పున 150 డివిజన్లలో 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
వాహనం ఒక్కో యూనిట్ విలువ 10 లక్షల రూపాయలు కాగా, ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 6 లక్షల రూపాయలు, లబ్ధిదారుల వాటా 4 లక్షల రూపాయలుగా పథకం రూపకల్పన చేశామన్నారు. ఈ పథకం హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. దరఖాస్తులు ఒకటి కంటే ఎక్కువ వస్తే ఆమోద కమిటీ (DSAC) వారిచే లాటరీ తీస్తామని చెప్పారు. వాహనాలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 10 వరకు గడువు ఉందన్నారు. 16 లేదా 17 తేదీల్లో లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు.
ఇదీ చదవండి:బిహార్‌లో రెండోదఫా ఎన్నికల ప్రచారానికి తెర