కరోనా మహమ్మారి నగరాలు, పట్టణాలు, పలెల్లు అనే తేడా లేకుండా వ్యాప్తి చెందింది. చాలా మంది కొవిడ్ బారిన పడ్డారు. ఈ పరిస్థితుల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం చాలా అవసరంకాగా.. అంగన్ వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. పట్టణాల్లో అంతగా ఇబ్బంది లేకపోయినా.. పల్లెలు, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీల్లో.. గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడీల సేవలు చాలా అవసరం. కరోనా ఉద్ధృతి వల్ల సహాయానికి ఆటంకం కలగకుండా ఇళ్లకే రేషన్‌ను చేరవేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల సరుకులను చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. గుడ్లు, పాలు, నూనె, పప్పు, ఉప్పుతో పాటు బాలామృతాన్ని ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు.
ఫీవర్ సర్వేలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు
గర్భిణులను సమయానుసారం ఆస్పత్రులకు తీసుకెళ్లడం, ప్రసవాలు చేయించి ఇళ్లకు చేరుస్తూ అంగన్‌వాడీలు మన్ననలు పొందుతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. ఫీవర్ సర్వేలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో కలిసి అంగన్ వాడీలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందిస్తూ బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.