రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బందికి వేతనాలు పెరిగాయి. టీచర్లు, కార్యకర్తలకు 30 శాతం మేర వేతనాలు పెంచారు. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు జులై నుంచి అమలులోకి రానున్నాయి.
అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుతం రూ. 10,500 వేతనం చెల్లిస్తుండగా.. 30 శాతం పెంపుతో రూ. 13,650 అందుకోనున్నారు. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ. 6వేల నుంచి రూ. 7,800... అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ. 6వేల నుంచి రూ. 7,800కు పెంచారు. వేతనాల పెంపుతో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పౌష్టికాహారం అందించడంలో..
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పల్లెలు, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలైన ఏజెన్సీల్లో.. గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడీల సేవలు చాలా అవసరం. కొవిడ్ మొదటి, రెండో దశ సమయాల్లో అంగన్వాడీ వర్కర్లు విశేష సేవలందించారు. గుడ్లు, పాలు, నూనె, పప్పు, ఉప్పుతో పాటు బాలామృతాన్ని ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు.
ఫీవర్ సర్వేలోనూ క్రియాశీలక పాత్ర
గర్భిణులను సమయానుసారం ఆస్పత్రులకు తీసుకెళ్లడం, ప్రసవాలు చేయించి ఇళ్లకు చేరుస్తూ అంగన్‌వాడీలు మన్ననలు పొందుతున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. ఫీవర్ సర్వేలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో కలిసి అంగన్ వాడీలు ఇంటింటికి వెళ్లి సర్వేలో పాల్గొన్నారు.
మారుమూలల్లో..
మారుమూల ప్రాంతాల్లో అంగన్ వాడీ కార్యకర్తలు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని అధికారులు, ప్రజల కితాబిస్తున్నారు. కరోనా మొదటి వేవ్‌లో అద్భుత పనితీరు కనబర్చిన.. రాష్ట్రానికి చెందిన అంగన్ వాడీ కార్యకర్తలకు జాతీయ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:KTR: 'సిరిసిల్ల జిల్లాలో ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందిస్తాం'