ఇంతకుముందే ఆరంభించిన సంక్షేమ బాటలోనే ఏపీ బడ్జెట్ బండి సాగిపోయింది. ఆసరా, చేయూత, భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన... వంటి పథకాలకు ప్రాధాన్యమిస్తూ గత ఒరవడినే కొనసాగించింది. నేరుగా ప్రజలకు నిధులు అందించడమే ప్రధాన కార్యక్రమంగా అడుగులు వేసింది. రాష్ట్రంలోని లబ్ధిదారుల ఖాతాలకే రూ.48,083.92 కోట్లు చెల్లించనుంది.
రాష్ట్ర బడ్జెట్‌లో వంద రూపాయలు ఖర్చు ప్రతిపాదిస్తే 20 రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు బదిలీ చేయనుంది. నవరత్నాలకు ప్రాధాన్యమిస్తూ, దాదాపు 22 పథకాల ద్వారా రైతులు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల్లోని పేదలకు చేయూత ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,29,779.27 కోట్ల అంచనా వ్యయంతో గురువారం బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభకు సమర్పించారు.
తొలిసారిగా పిల్లల బడ్జెట్, మహిళల బడ్జెట్ పేరుతో విడిగా కేటాయింపులు చూపారు. వివిధ సామాజికవర్గాలకు కేటాయింపులను కూడా ప్రత్యేకంగా సభ ముందుంచారు. మొత్తం బడ్జెట్ ప్రతిపాదనల్లోనే అవి భాగమైనా ఏ వర్గం ఎంత ప్రయోజనం పొందుతోందో వివరించే ప్రయత్నం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకునే క్రమంలోనే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. కరోనా కాలంలో ఏపీలో పేదలకు నేరుగా సాయం అందించిన తరహాలో మరే రాష్ట్రమూ చేయూత ఇవ్వలేదని ప్రపంచబ్యాంకు నివేదిక ప్రశంసించినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న వైఎస్సార్ పింఛను మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,500కు పెంచబోతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. లబ్ధిదారులకు దాదాపు 22 పథకాల ద్వారా నేరుగా లబ్ధి కల్పిస్తున్నట్లు వివరించారు. కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా ప్రస్తుత ఏడాది ఇందుకోసం అదనంగా రూ.4,141 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా అందించే మూడు పథకాలకు సంబంధించి రూ.16,890 కోట్లు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణాల రూపంలో సమీకరించాల్సి వస్తోంది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మఒడి కార్యక్రమాలకు అవసరమైన నిధులు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరిస్తోంది.
కొవిడ్‌కు రూ.1000 కోట్లు!
రాష్ట్ర ప్రజానీకాన్ని కకావికలం చేస్తున్న కొవిడ్‌పై పోరుకు రూ.500 కోట్లు, కరోనా టీకాల కోసం రూ.500 కోట్లు బడ్జెట్‌లో చూపారు. ప్రస్తుత సంవత్సరంలోనే ప్రజలందరికీ టీకాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కేటాయించిన నిధులు ఏమేరకు సరిపోతాయన్నది ప్రశ్నార్థకం.
* రాష్ట్రంలో ప్రధాన వ్యవసాయ రంగానికి రూ.11,210.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసాకు రూ.3,845.30 కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లు కేటాయించారు.
* విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలను కాన్సెప్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు. ప్రభుత్వ తోడ్పాటుతో, ప్రైవేటు రంగం నేతృత్వంలో వీటిని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఆదాయాలపైనే సందిగ్ధత
బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో సాకారం కావాలంటే ఆదాయ సముపార్జన అన్నింటి కన్నా ముఖ్యం. అనుభవాలు ఒకలా ఉన్నాయి. అంచనాలు మరోలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్యాలు చేరుకోవడం ఎంత వరకు సాధ్యమవుతుందనేది వచ్చే ఏడాది మార్చి చివరి నాటికే తెలుస్తుంది.
బడ్జెట్ ముఖ్యాంశాలు
2021-22 బడ్జెట్
2,29,779 కోట్లు
* పోలవరం ప్రాజెక్టుకు రూ.4,510 కోట్లు
* వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.2,258 కోట్లు
* వైఎస్సార్ రైతు భరోసాకు రూ.3,845.30 కోట్లు
* కడప జిల్లాలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి రూ.25వేల కోట్ల పెట్టుబడి
* కడప స్టీలు ప్లాంటుకు రూ.250 కోట్లు