తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణాజలాల వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. కేంద్రం, కోర్టులు, ట్రైబ్యునళ్లు, బోర్డు.. ఇలా అన్నింటిలోనూ ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. విద్యుదుత్పత్తి, రాయలసీమ ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, కృష్ణాబోర్డు సమావేశం.. ఇలా అన్ని అంశాలపైనా పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ కోరింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర పర్యావరణ అనుమతి మదింపు కమిటీకి లేఖ రాశారు. ఈ పథకం అటవీప్రాంతంలో కానీ, వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో కానీ లేదని, పర్యావరణ అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రికి లేఖ రాయగా, అది వన్యప్రాణి ప్రాంతంలోనే ఉందంటూ అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ తన లేఖలో జతచేసింది.
తెలంగాణ వాదన..
ఈనెల 7న పర్యావరణ మదింపు కమిటీ సమావేశం జరగనుంది. రాయలసీమ పథకానికి అనుమతి అంశం కూడా ఎజెండాలో ఉంది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ కేంద్రానికి లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీయే అనధికార ప్రాజెక్టు అని, దానికి జలసంఘం అనుమతి లేదని, అలాంటిది దాని విస్తరణ కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి ఎలా ఇస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది.
ఏపీ సీఎం లేఖ..
నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అనధికార ప్రాజెక్టు అని, దానికి శ్రీశైలంలో 800 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకుంటారని, ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల తప్ప ప్రత్యామ్నాయం లేదని, అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ అనధికారికంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తోందని, కల్వకుర్తి, ఎస్.ఎల్.బి.సి. విస్తరణ చేపట్టిందని, దానిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
భేటీ వాయిదా వేయండి..