తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్ట్రేలియా నుంచి చెన్నైకి.. పురాతన నటరాజ స్వామి విగ్రహం - తమిళనాడు

37 ఏళ్ల క్రితం తమిళనాడులో చోరీకి గురైన పురాతన నటరాజ విగ్రహాన్ని.. ఉన్నతాధికారులు ఆస్ట్రేలియా నుంచి మళ్లీ చెన్నైకి చేర్చారు.

ancient nataraja idol

By

Published : Sep 13, 2019, 5:52 PM IST

తమిళనాడులో గతంలో తస్కరణకు గురైన అతి పురాతన నటరాజ స్వామి విగ్రహాన్ని.. ఆస్ట్రేలియా మ్యూజియం నుంచి చెన్నైకి రప్పించారు. ఏళ్ల పాటు శ్రమించి.. ఈ విగ్రహాన్ని తిరిగి చెన్నైకి చేర్చడంపై.. అధికారుల శ్రమను భక్తులు అభినందిస్తున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్​కు విగ్రహం రాగానే.. విశేష పూజలు చేశారు. నటరాజును చెన్నైకి మళ్లీ స్వాగతించినట్టుగా.. సంబరాలు చేశారు. ఓ దశలో.. చెన్నై రైల్వే స్టేషన్.. నటరాజ ఆలయాన్ని తలపించింది.

అసలు విషయం ఏంటంటే...

పాండ్య రాజుల కాలంలో.. తిరునెల్వేలి జిల్లాలో కులశేఖర ముడయాన్ ఆలయం నిర్మించారు. ఈ పురాతన ఆలయంలో నటరాజ పంచలోహ విగ్రహంతో పాటు, శివకామి అమ్మవారి విగ్రహం, వినాయక విగ్రహాలు 37 ఏళ్ల క్రితం చోరీకి గురయ్యాయి. వాటిలో నటరాజ విగ్రహం మాత్రం ఆస్ట్రేలియాలోని వస్తు ప్రదర్శనశాలకు చేరింది. ఈ విషయంపై... తమిళనాడు పురాతన విగ్రహ తస్కరణ నిరోధ విభాగానికి సమాచారం అందింది. భారత పురావస్తు శాఖ, విదేశీ వ్యవహారాల శాఖల సహాయంతో... ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తమిళనాడు పురాతన విగ్రహ తస్కరణ నిరోధక శాఖ చేరవేసింది. అందుకు సంబంధించిన 1950 నాటి చిత్ర పటాలను, రుజువులనూ పంపించింది. ఆ విగ్రహం కులశేఖర ఆలయంలో భక్తులతో విశేష పూజలందుకున్న విగ్రహమని, ప్రదర్శనకు ఉద్దేశించిన విగ్రహం ఎంత మాత్రం కాదని.. అధికారులు స్పష్టంగా వివరించారు. మనవాళ్ల వాదనతో ఏకీభవించిన ఆస్ట్రేలియా పురావస్తు శాఖ... విగ్రహాన్ని అప్పగించేందుకు అంగీకరించింది. ఇచ్చిన మాట ప్రకారం.. విగ్రహాన్ని దిల్లీకి విమానంలో పంపించింది. అక్కడి నుంచి తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో చెన్నైకి నటరాజు తరలివచ్చాడు.

2 వేల విగ్రహాలకు పైగా చోరీ..

తమిళనాడు నుంచి 2 వేలకుపైగా పురాతన విగ్రహాలు చోరీకి గురై వివిధ దేశాలలో ఉన్నాయని అధికారులు అంచనావేశారు. వీటి విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పారు. సమీప భవిష్యత్తులో మరో 20 విగ్రహాలను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన నటరాజ విగ్రహం విలువ అంతర్జాతీయ మార్కెట్లో 30 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.

ఆస్ట్రేలియా నుంచి చెన్నైకి.. పురాతన నటరాజ స్వామి విగ్రహం

ఇవీ చూడండి:అక్రమ హోర్డింగులపై మద్రాస్​ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details