YCP activists attack on TDP: 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు నియోజకవర్గమంతా చెలరేగిపోవడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు, వేధింపులకు దిగారు. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీకి చెందినవారిని గ్రామ బహిష్కరణ చేసి తరిమికొట్టారు.
YCP activists create havoc in macherla : దుర్గి మండలం ఆత్మకూరు, జంగమేశ్వరపాడు వంటి గ్రామాల నుంచి టీడీపీ మద్దతుదారుల్ని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు. వారికి ఆశ్రయం కల్పించేందుకు టీడీపీ కొన్నాళ్లు గుంటూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధితులకు అండగా నిలిచేందుకు ఆత్మకూరు బయల్దేరితే, ఆయనను ఉండవల్లిలోని ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టేసి మరీ పోలీసులు అడ్డుకున్నారు.
జంగమేశ్వరపాడులో 2020లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడిచేయడంతో సుమారు 60 కుటుంబాలు గ్రామం వదిలివెళ్లిపోయాయి. గుండ్లపాడు గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు తరలిపోయాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టపగలే గొంతు కోసి చంపేయడం మాచర్లలో వైసీపీ నేతలకు మంచినీళ్లు తాగినంత తేలిక. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకి చెందిన టీడీపీ నేత చంద్రయ్యను నడిరోడ్డుపై పట్టపగలే గొంతు కోసి హత్యచేశారు.
ఆ కేసులో ప్రధాన నిందితుడు శివరామయ్యతో పాటు, మరికొందరు కొన్ని రోజులు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ గ్రామంలో టీడీపీ మద్దతుదారులకు చెందిన కొన్ని కుటుంబాలు వైసీపీ దాడులతో గ్రామం విడిచి వెళ్లిపోయాయి. 2022 జూన్ నెలలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నాయకుడు జల్లయ్యను అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దారికాచి హత్యచేశారు.
మాచర్ల నియోజకవర్గంలో ఎన్నిక ఏదైనా దాదాపు ఏకగ్రీవం కావాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే ఒక్క గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మాచర్ల మున్సిపాలిటీతోపాటు, దుర్గి, కారంపూడి, రెంచచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులు అన్నీ వైసీపీ అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి భయ పెట్టి ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఎన్నికలన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు.
నామినేషన్ పత్రాల్ని బలవంతంగా లాక్కొని చించేశారు:ఒక్క దుర్గి మండలంలోని ధర్మవరంలో మాత్రం సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగింది. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తే వైసీపీ నాయకులు దాడిచేసి నామినేషన్ పత్రాలు చించేశారు. వెల్దుర్తి మండలం బొదలవీడు గ్రామంలో టీడీపీ తరపున ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేయడానికి మహిళ వెళ్లగా అధికారుల ముందే నామినేషన్ పత్రాల్ని వైసీపీ కార్యకర్తలు బలవంతంగా లాక్కొని చించేశారు.
బొదలవీడు ఘటన తర్వాత అక్కడ పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమ, బుద్ధా వెంకన్న, న్యాయవాదులతో కలసి వెల్దుర్తి వెళ్తున్నప్పుడు వారి వాహనం మాచర్ల పట్టణంలోకి ప్రవేశించగానే దాడి జరిగింది. అప్పటి వైసీపీ పట్టణ యువజన నాయకుడు తురక కిశోర్ పెద్ద పెద్ద కర్రలతో కారు అద్దాలు పగలగొట్టారు. టీడీపీ నాయకుల్ని గాయపరిచారు. న్యాయవాదికి తీవ్ర రక్తస్రావమైంది.
ఆ దాడి తర్వాత విపక్ష పార్టీలకు చెందినవారు ఎక్కడా నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు. విపక్ష నాయకులపై దాడి ఘటనతో కిశోర్ వైసీపీ పెద్దల కళ్లల్లో పడి స్థానికంగా పెద్ద నాయకుడైపోయాడు. తర్వాత అతడిని మాచర్ల మున్సిపాలిటీకి ఏకంగా ఛైర్మన్‌నే చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఆ దాడికి సంబందించి వీడియోలు, ఫొటోలు సహా అన్ని అధారాలూ ఉన్నా ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతీ లేదు.
శుక్రవారం జరిగిన బీభత్సకాండకూ కిశోరే సూత్రధారి కావడం విశేషం. మాచర్లలోని 13వ వార్డుకి చెందిన కిశోర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడు. వారి అండదండలతో 2012 నుంచి వైసీపీ మాచర్ల పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. 2020లో పురపాలక ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడే బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడికి పాల్పడ్డారు.
దాడి ఘటనతో కిశోర్‌ని కౌన్సిలర్ అభ్యర్థిగా ఖరారు చేశారు. మాచర్లలో అన్ని కౌన్సిలర్ స్థానాలూ ఏకగ్రీవమవడం ఛైర్మన్ పదవి బీసీలకు రిజర్వు కావడంతో కిశోర్ ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ అయిపోయారు. ఛైర్మన్ పదవిని అడ్డుపెట్టుకుని మాచర్లలో కిశోర్ అనేక భూకబ్జాలు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా లేదు.