తెలంగాణ

telangana

ETV Bharat / state

మీకు కావాల్సింది డీజిల్..! కావాలంటే బిల్లు చూసుకోండి: ఆర్టీసీ డిపోలో వాగ్వాదం - అనంతపురం జిల్లా వార్తలు

Guntakal RTC depot diesel tanker seized: ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీసీ డిపోకు ఇంధన సరఫరా చేస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన కాంట్రాక్టర్లు.. అధికారులతో దాదాపు మూడు గంటలకుపైగా వాగ్వావాదానికి దిగారు. తమ వద్ద బిల్లులు అన్ని సక్రమంగా ఉన్నాయని, తమ వాహనం ఎలా సీజ్ చేస్తారంటూ మండిపడ్డారు. అందరి అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటూ రెచ్చిపోయారు.

ఆర్టీసీ డిపోలో వాగ్వాదం
ఆర్టీసీ డిపోలో వాగ్వాదం

By

Published : Feb 11, 2023, 9:45 PM IST

Guntakal RTC depot diesel tanker seized: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపోకు ఇంధన సరఫరా చేస్తున్న డీజిల్ ట్యాంకర్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఆర్టీసీ డిపోలోని బస్సులకు ఇంధనం నింపడం కోసం కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు.. అధికారులు అనుమతించిన ప్రదేశం నుంచి కాకుండా.. మరో ప్రాంతం నుంచి ఇంధనాన్ని డిపోకు సరఫరా చేస్తుండగా అధికారులు గమనించి పట్టుకున్నారు. అయితే.. టెండర్ పొందిన వ్యక్తి మాత్రం తమకు అన్ని బిల్లులు సక్రమంగా ఉన్నాయని, అనుకూలమైన ప్రాంతం నుండే ఇంధనం సరఫరా చేయడానికి తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ అధికారులతో వాగ్వావాదానికి దిగారు.

అంతకుముందు అనధికారిక ప్రాంతం నుంచి ఇంధనం తీసుకొని ఆర్టీసీ డిపోకు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు.. ఆర్టీసీ డిపోలో తనిఖీలకు వెళ్లి ఆర్టీసీ సిబ్బందికి, రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. దీంతో పర్మిషన్ లేకుండా ఆర్టీసీ డిపోలోకి ఎలా ప్రవేశిస్తారు అంటూ సిబ్బంది హంగామా సృష్టించారు. గుంతకల్లు ఆర్టీసీ డిపోకు గార్లదిన్నెలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ఇంధనం సరఫరా చేయాల్సి ఉండగా.. సుదూర ప్రాంతంలోని మడకశిర నుంచి డీజిల్ సరఫరా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

130 కిలోమీటర్ల దూరం నుంచి ఇంధనాన్ని సరఫరా చేయాల్సి ఉండగా.. దాదాపు 450 కిలోమీటర్ల దూరం నుంచి డీజిల్ తీసుకొని డిపోలో అన్‌లోడ్‌ చేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. అంతేకాకుండా, కర్ణాటక ప్రాంతంలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి తీసుకొని వచ్చి.. నకిలీ బిల్లుల ద్వారా డిపోకు సరఫరా చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక దశలో మూడు గంటల పాటు రెవెన్యూ అధికారులకు, డిపో అధికారులకు, కాంట్రాక్టర్‌కు మధ్య వివాదం కొనసాగింది. వాహనాన్ని సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా.. తమ వద్ద బిల్లులు అన్ని సక్రమంగా ఉన్నాయని, తమ వాహనం ఎలా సీజ్ చేస్తారని అందరి అధికారులపై.. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటూ కాంట్రాక్టర్లు రెచ్చిపోయారు. అయితే, కాంట్రాక్టర్లు, అధికారులు మామూళ్ల కోసం.. రాజకీయ నాయకులు వారి వర్గం వారికి కాంట్రాక్ట్ అప్పగించడం కోసం.. తమపై మాటిమాటికీ పైఅధికారులతో దాడులు చేయిస్తూ.. ఇలా ఒత్తిడి చేస్తున్నారని డిపో అధికారులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details