హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం పంపిణీకి రంగం సిద్ధం కాగా.. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకూ ఈ ఔషధం అందుబాటులోకి రానుంది. ఆనందయ్య ఔషధాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రివెంటెవ్ మెడిసిన్ "పీ" తయారీని..చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముక్కోటి తీర్థంలో ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆయన శిష్యబృందం కలిసి ఔషధాన్ని తయారుచేస్తున్నారు.
ఆరు రకాల వనమూలికలు సిద్ధం
ఔషధం తయారీ కోసం చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల అటవీ ప్రాంతాల నుంచి స్థానిక ప్రజలే ఆరు రకాల వనమూలికలు సిద్ధం చేయగా... కృష్ణపట్నం నుంచి ఆనందయ్య మరో పదిరకాల ముడిపదార్థాలను పంపించారు. మొత్తం 16రకాల ఔషధాలతో కూడిన మందు తయారీ చేస్తున్నారు. ఆనందయ్య ఔషధంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని గౌరవించి.. కరోనా నివారణకు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ప్రివెంటివ్ మెడిసిన్‌ను మాత్రమే తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. నియోజక వర్గంలో లక్షా 60 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని చెవిరెడ్డి తెలిపారు.