" నేను నీకు హామీ ఇస్తున్నా. నా గుండె, ఆత్మ, శరీరం సాక్షిగా.. ప్రపంచంలోని దుష్టశక్తులు, హీనుల బారినపడకుండా నిన్ను రక్షించుకుంటా. నీ భద్రత కోసం అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తా". నిర్భయ తర్వాత... దేశవ్యాప్తంగా సంచలనమైంది కథువాలో బాలిక అత్యాచార ఘటన. ఆ సమయంలో... నటి సన్నీ లియోని ట్విట్టర్‌లో ఇలా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. పోస్ట్ చేసింది ఆమే అయినా... మొత్తం దేశంలోని తల్లులందరి మనసులోని భావాన్ని ప్రతిబింబించింది ఈ ఫొటో.
టైమ్ మ్యాగజైన్ కథనం:
2012 నాటి నిర్భయ ఘటన. బస్సులో యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపటం అందరిలోనూ ఆగ్రహం, ఆందోళన కలిగించింది. తర్వాత ముంబయిలో 23 ఏళ్ల యువతిపై అత్యాచారమూ అదే స్థాయిలో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనల నేపథ్యంలోనే... టైమ్ మ్యాగజైన్ భారత్ గురించి ఇలా వ్యాఖ్యానిస్తూ... కథనం రాసింది. భారతదేశ సమాజంలోని పురుషాధిక్యతకు ఇవి అద్దం పడుతున్నాయని అందులో పేర్కొంది. ఏ దేశంలో అయితే స్త్రీని గౌరవిస్తారన్న భావన ఉందో... అదే దేశం అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునేలా చేసింది. అమ్మాయిలకు రక్షణ ఎక్కడ అంటే... అమ్మ కడుపులోనే అని చెప్పుకోవాల్సిన దుస్థితి.
నివ్వెరపోయే నిజాలు..
ఇకపై ఏ అమ్మాయి గుడికి వెళ్లినా, బడికి వెళ్లినా వెంట ఓ పోలీసును పంపాల్సి వస్తుందేమో ..! ఇదేమీ అతిశయోక్తి కాదు. వాస్తవం. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అసలు వారికి రక్షణ ఎక్కడ ఉంటుందో ఎక్కడ ఉండదో తెలియడం లేదు. ఏ తండ్రైతే తన గుండెలపై అడుగులు వేయిస్తూ ఆడించాడో... అదే నాన్న... ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడితే ఆ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది..? ఏ అన్నైతే తనతో పాటు అమ్మ చేతితో గోరు ముద్దలు తిన్నాడో... అదే అన్న పశువుగా ప్రవర్తిస్తే..? ఆ చిన్నారి ఎవరికి చెప్పుకుంటుంది..? ఇవేవీ ఊహాజనితం కావు. నివ్వెరపోయేలా చేసిన నిజమైన ఘటనలు.