మన్యం ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ గడిపే బతుకులు... మంచినీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా పొందలేని ప్రజలు. ఇతర ప్రాంతాలకు చేరుకునే దారిలేక... విద్యకు సైతం నోచుకోలేక ఏళ్లుగా ఇదే సమస్యలతో ఏపీ విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం గడుతూరు పంచాయతీలోని బందలపణుకు గ్రామస్థులు జీవనం సాగిస్తున్నారు. అక్కడి ప్రజల పరిస్థితి విన్న మండల అభివృద్ధి అధికారి వెంకన్నబాబు... మరికొందరు సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
రహదారి మార్గం లేక... వాహనాల ప్రసక్తే లేక... కొండలు, గుట్టలను లెక్క చేయకుండా కాలినడకన ప్రయాణం సాగించారు. సాహసయాత్రను తలపించే ఈ గమనంలో... శరీరానికి అలసట ముంచుకొస్తున్నా... మార్గమధ్యలో అడ్డు వచ్చే జలపాతాలను దాటుకుంటూ సుమారు 4 గంటల పాటు ప్రయాణించి... బందలపణుకు చేరుకున్నారు.
అధికారుల రాకతో ఆశ్చర్యపోయిన స్థానికులు... ఇంతవరకూ ఏ ఒక్కరూ తమను పట్టించుకున్న సందర్భాలు లేవని వాపోయారు. మౌలిక సదుపాయాలు సైతం అందడం లేదని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.