ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం సృష్టిస్తోన్నాయి. ఇటీవలే ఫంగస్ బారిన పడి.. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో పలువురు బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలో కొవిడ్ విస్తృతంగా వ్యాపిస్తున్నందున.. దీనిపై పూర్తి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో సగటున రోజుకు వెయ్యి పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రెండు రోజులు కొద్దిగా తగ్గినట్లు అనిపించినా.. మళ్లీ మంగళవారం పెరిగాయి. మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. మంగళవారం 10 మంది కరోనాతో చనిపోయారు. సగటున 9 మంది రోజుకు మరణిస్తున్నారు. మొదటి, రెండో దశలో కలిపి 882 మంది మృతి చెందారు. రెండో దశలోనే ఇది ఎక్కువగా ఉంది. గత రెండు నెలల్లో 200 మంది మృతి చెందడం గమనార్హం. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్న వారికీ ఈ కొత్త వైరస్ సోకుతోంది.
ప్రధానంగా.. ఫంగస్ ముక్కు ద్వారానే ప్రవేశిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ను జయించామని.. నిర్లక్ష్యంతో ఉండకూడదని, మాస్క్ రక్షణగా ఉంటుందంటున్నారు. కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్ ఎక్కువగా వినియోగించడం వల్ల వారిలో షుగర్ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలా ఎక్కువైన వారికి త్వరగా వైరస్ అంటుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. ముక్కు ద్వారా ప్రవేశించి.. కళ్లు ఇతర భాగాలు, మెదడుపై ప్రభావం చూపుతాయని, మృత్యు రేటు ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో 10 వరకు ఉన్నట్లు గుర్తించారు. గన్నవరం ప్రాంతంలో 8 మందికి వచ్చినట్లు, విజయవాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో గుర్తించినట్లు తెలిసింది.
మందులు లేవు..!
బ్లాక్‌ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు లభించడం లేదు. వైద్యులు ఇదే చెబుతున్నారు. ఔషధ నియంత్రణ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. లిపోసోమాల్ ఆంఫిటెంపిన్ బీ అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రోగి బరువును బట్టి ఈ ఇంజక్షన్‌లు ఎన్ని ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఈ రకం ఇంజక్షన్‌లు విజయవాడలో లభించడం లేదని ఓ వైద్యుడు చెప్పారు. కొన్ని రకాల మాత్రలు కూడా లభించడం లేదు. దీంతో చికిత్స సమస్యగా మారింది. ఇంతవరకు కొవిడ్ వైరస్‌పైనే దృష్టి సారించారు. కొవిడ్ అనంతరం స్టెరాయిడ్స్ వల్ల వచ్చే మ్యుకార్‌మైకాసిస్‌ను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే వ్యాధి వల్ల రెండు కళ్లు వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించారు. మందుల కోసం అధికారులు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు.
అవగాహన ముఖ్యం..!