Hyderabad Railway Station Development for Long Term : వచ్చే 50 ఏళ్ల ముందుచూపుతో దక్షిణాదిలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైనీ తెలిపారు. అమృత్ భారత స్టేషన్లో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఆమోదం లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 114 స్టేషన్లలో మొదటి దశలో 50 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్లో 11, మహారాష్ట్రలో 13, కర్ణాటకలో ఒక స్టేషన్ను రూ.2 వేల 79 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు రైల్వే జీఎం వెల్లడించారు.
SCR General Manager Talking about Railway Station Development : ప్రస్తుతం స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వారికి కావల్సిన సదుపాయలను సమకూర్చడంతో పాటు సకల హంగులతో స్టేషన్లను తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయాణికులకు సంబంధించి అన్ని ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆధునీకరించే 50 స్టేషన్లకు ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించినట్లు జీఎం వివరించారు. అయితే ఆధునీకరించే రైల్వే స్టేషన్ల ఫ్లాట్ ఫాం టికెట్ ధరలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మొదటి దశ పూర్తైన తర్వాత రెండో దశలో మిగతా స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు రైల్వే జీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లను, ఆధునీకరించనున్న ప్రతిపాదిత రైల్వే స్టేషన్ల ఛాయా చిత్రాలను ఆయన విడుదల చేశారు.