- అక్కడి అందరి ఆశ, శ్వాస ఒక్కటే అమరావతిని కాపాడుకోవటం..
- కులమతాలతీతంగా అందరి లక్ష్యం ఒక్కటే రాజధాని తరలిపోకుండా అడ్డుకోవటం..
- రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, ప్రజలు సహా విపక్ష రాజకీయ పార్టీలు, సంఘాల అలుపెరగని పోరాటం మొదలై నేటితో 550 రోజులు..
- 2019 డిసెంబరు 17న శాసనసభలో ముఖ్యమంత్రి 3 రాజధానుల ఆలోచన బయటపెట్టిన మరుసటిరోజు నుంచే రాజధాని రైతుల పోరుబాట
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో సుమారు 34,322 ఎకరాలను 29,881 మంది రైతులు భూసమీకరణలో భాగంగా ఇచ్చారు. వారిలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే. ప్రభుత్వం మారినా.. రాజధాని ఇక్కడే ఉంటుందన్న భరోసాతో ఉన్న రైతులకు 2019 డిసెంబరు 17న శాసనసభలో.. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఆలోచన శరాఘాతంలా మారింది. ఆ మర్నాటి నుంచే రాజధానిలో ఉద్యమం ఊపిరిలూదుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలై... క్రమంగా రాజధానిలోని అన్ని గ్రామాలకూ ఉద్యమం విస్తరించింది. రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి అధికార వైకాపా తప్ప, మిగతా అన్ని పార్టీలూ సంఘీభావం ప్రకటించాయి. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్రం నలుమూలల, ఇతర రాష్ట్రాల నుంచి రైతులు, రైతు నాయకులు వచ్చి రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు.
తేదీలవారీగా ఉద్యమంలో కొన్ని ముఖ్య ఘట్టాలు..
- 17.12.2019- ముఖ్యమంత్రి జగన్ శాశనసభలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటన
- 18.12.2019- రాజధాని ఉద్యమం మెుదలు
- 19.12.2020- అమరావతిలో రైతుల బంద్.. 144 సెక్షన్ అమలు
- 29.12.2019- 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు
- 03.01.2020- రాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్.. ఎన్‌హెచ్‌ఆర్సీకి తెదేపా ఫిర్యాదు
- 03.01.2020- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్, గవర్నర్, సీఎం, అన్ని హెచ్‌వోడీల కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు.
బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ బోగస్ అంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆక్షేపణ.
- 09.01.2020- బెజవాడలో చంద్రబాబు బైఠాయింపు.. బస్సుయాత్రకు పోలీసుల అడ్డంకులు..ప్రారంభించి తీరుతామన్న చంద్రబాబు.. బెంజి సర్కిల్లో రోడ్డుపైనే నిరసన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనాన్ని కదలనీయని జనం... మూడున్నర గంటలపాటు ఉత్కంఠ.
- 12.01.2020- రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నారైలు డిమాండ్ చేశారు. సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ కానీ అధికార వికేంద్రీకరణ కాదని నినాదాలు.
- 13.01.2020- ఈనాడు కథనాల్ని ఫోటోలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు న్యాయస్థానం.
- 20-03.2020- రాష్ట్రంలో కరోనా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి అత్యవసరంగా సమావేశం ఏర్పాటు. ప్రతి శిబిరంలో నియమిత సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ప్రతి ఒక్కరు మరొకరితో 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉద్యమంలో పాల్గొంటారని నేతల స్పష్టీకరణ.
- 25.03.2020- నాటికి 100వ రోజుకు చేరుకున్న ఉద్యమం.
100వ రోజు వరకు ముఖ్య ఘట్టాలు
- మొదట్లో రోడ్లపైనే నిరసన తెలియజేశారు. క్రమంగా పలుచోట్ల రోడ్ల మీదే వంటావార్పు చేపట్టి రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామ సచివాలయాలకు నల్లరంగు పూసి నిరసన తెలిపారు.
- రోడ్లపై నిరసనలు తెలియజేయకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రైవేటు స్థలాల్లో శాశ్వత శిబిరాలు ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగించారు.
- విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకుని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాదయాత్రగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.
- మందడంలోని నిరసన శిబిరంలో దీక్ష చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజల్ని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. పోలీసులు మహిళలపై దాడి చేయడంతో, ఒక మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో పోలీసుల వైఖరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- జాతీయ మహిళా కమిషన్ బృందం రాజధాని గ్రామాలు, గుంటూరు, విజయవాడ నగరంలో పర్యటించి బాధితుల నుంచి వినతులు స్వీకరించింది.
- రాజధాని రైతులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దాదాపుగా అసెంబ్లీ వరకు చేరుకున్నారు. రైతులతో పాటు ముట్టడిలో పాల్గొన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అరెస్టు చేశారు. మహిళలు, రైతులపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో బంద్ పాటించారు.
04.07.2020-నాటికి 200వ రోజుకు చేరుకున్న అమరావతి ఉద్యమం
23.08.2020- నాటికి 250వ రోజుకు చేరుకున్న రైతుల నిరసనలు
ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు దీక్షకు కూర్చున్నారు. 251వ రోజు మొదలు 50 రోజులపాటు దీక్ష చేయాలని నిర్ణయించారు.
300 రోజులకు చేరుకున్న అమరావతి ఉద్యమం
- 12.10.2020-నాటికి 300 రోజులకు చేరుకున్న అమరావతి ఉద్యమం
- ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళిగా తుళ్లూరులో రాజధాని గ్రామాల రైతులు ‘ఆత్మ బలిదాన యాత్ర’ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఉద్యమంలో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన 92 మంది రైతులు, రైతుకూలీల చిత్రాలు ఉంచిన పాడెలను మోస్తూ దీక్షా శిబిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ పాదయాత్రగా వెళ్లారు.