ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ తాము పోరాడేందుకు సిద్ధమని అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం కాకుండా... రాష్ట్రమంతా వ్యాపింపజేయాలని నిర్ణయించారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం ఈ నెల 17వ తేదీకి ఏడాది పూర్తి చేసుకోనున్న క్రమంలో విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాస ఆధ్వర్యంలో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు, మహిళలు, రైతు కూలీలు హాజరయ్యారు.
దిల్లీలో తేల్చుకుందాం..
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని ఉండాలని జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన అంశాన్ని నేతలు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయం వల్ల భూములిచ్చిన అన్నదాతలు రోడెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని ఐకాస నేతలు కోరారు. అమరావతి ఉద్యమ సెగ సీఎంకు తగులుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. అందుకే సచివాలయానికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారని విమర్శించారు. ఉద్యమం బలంగా సాగుతుండటం వల్లే అమరావతిని జగన్ కదలించలేకపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల పల్లవిని సీఎం ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రైతుల ఉద్యమిస్తున్న తరహాలోనే అమరావతి సాధన కోసం దిల్లీ వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు పోరాడదామని తెలిపారు.
భాజపా ద్వంద్వ వైఖరి..
రాజధాని ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారితేనే అన్ని జిల్లాల ప్రజలు కదలివస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అభిప్రాయపడ్డారు. దిల్లీ సరిహదుల్లో రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం విజయవంతమైతే అమరావతి రైతులు కూడా విజయం సాధించినట్లేనని తెలిపారు. అమరావతి విషయంలో భాజపా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మహిళా ఐకాస నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. ఒక వైపు అమరావతికి అనుకూలం అంటూనే.. కేంద్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.