వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలోని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం కొత్తరూపు సంతరించుకోనుంది. పోరాటం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన జనభేరిసభ విజయవంతమైనట్లు అమరావతి ఐకాస నేతలు ప్రకటించారు. ఇన్నాళ్లూ.. గాంధేయమార్గంలో చేసిన పోరాటం ప్రభుత్వాన్ని కదిలించలేకపోవటంపై ఐకాస సమీక్షించింది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు ఉద్యమ తీవ్రతను పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ రాజధాని గ్రామాల్లోనే దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని రైతులు, మహిళలే ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. శిబిరాల నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి పోలీసుల అణచివేస్తున్నారు. ప్రతిఘటిస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా కేసులు నమోదు కాగా...దాదాపు 3వేల మంది రాజధాని రైతులు, మహిళల్ని అందులో చేర్చారు.
అన్ని జిల్లాల్లో..
కేసులు ఎదుర్కుంటూనే ఉద్యమాన్ని విస్తృతం చేయటంపై బహిరంగసభ ఊపునిచ్చింది. 30వేల మందికి పైగా సభకు హాజరైనట్లు ఐకాస ప్రకటించింది. ఇదే ఊపుతో పోరాటంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని భాగస్వామ్యుల్ని చేయటంపై చర్చించారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో రైతు ఐకాస, రాష్ట్ర పరిధిలో అమరావతి పరిరక్షణ సమితి, రాజకీయ ఐకాస, గుంటూరు, కృష్ణా జిల్లాల రాజకీయేతర ఐకాస ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇకపై 13 జిల్లాల్లో, 175 నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక ఐకాసలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అన్ని గ్రామాల్లో, వార్డుల్లోనూ ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఐకాస తరఫున ఏపీ వ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు.
ప్రజల్లోకి ఉద్యమం..