Amit Shah Telangana Tour Postponed : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 29న పార్టీ ముఖ్య నేతలతో సమావేశంతో పాటు సామాజిక వర్గాలతో సమావేశమయ్యేందుకు ఆయన పర్యటన ఖరారైంది. కానీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా వేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే అమిత్ షా పర్యటన ఎప్పుడు ఉండేది తెలియజేస్తామని వెల్లడించాయి.
Priyanka Gandhi Telangana Visit :మరోవైపు ఏఐసీసీ అధినేత ప్రియాంక గాంధీ.. తెలంగాణ పర్యటనపై భారీ వర్షాల ప్రభావం పడనుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 30న కొల్లాపూర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆమెను ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నెల 20న జరగాల్సిన సభను.. ప్రియాంక గాంధీ కోసం 30కి వాయిదా వేశారు.
కానీ ఇప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. మరో రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలు ఇలాగే కొనసాగితే ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సభ ఉంటుందా లేదా అనే గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటి వరకు పార్టీ ముఖ్య నేతలు ఈ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.