American Society of Civil Engineers praised Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్మించిన విషయం తెలిసిందే. అత్యంత తక్కువ సమయంలో ఎంతో నాణ్యతతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సొసైటీ ప్రశంసలు కురిపించింది. అమెరికాలోని నెవాడాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్‌లో కీలకోపన్యాసం అనంతరం సొసైటీ ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన మంత్రి కేటీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన వారి ఆలోచనలు, అనుభవాలు తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏఎస్ సీఈ ప్రతినిధులు గొప్పగా మాట్లాడారు.
US Engineers praised Kaleshwaram Project : ప్రాజెక్టు విజయగాథ నుంచి ప్రపంచం నేర్చుకోవచ్చని సొసైటీ ఛైర్మన్ మరియా సీ లెమాన్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైనదని సొసైటీ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్-ఎలెక్ట్ షిర్లీ క్లార్క్ తెలిపారు. తెలంగాణ వాసుల జీవన నాణ్యతను కాళేశ్వరం పెంచిందని షిర్లీ క్లార్క్ అభిప్రాయపడ్డారు. నీటిని 500 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం.... ఒక హైడ్రాలిక్ ఇంజనీర్‌గా తన మనసును ఆకట్టుకొందని వ్యాఖ్యానించారు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం... ప్రపంచ సవాలు అన్న సొసైటీ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్... తెలంగాణ ఈ విషయంలో ఇతరులకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.