తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ బాధితులను దారిలోనే నిలువుదోపిడీ చేస్తున్న అంబులెన్సులు - తెలంగాణలో అంబులెన్సులు

అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల్ని రక్షించే అంబులెన్స్​ల అద్దెలు సామాన్యులకు పెనుభారంగా మారాయి. కొవిడ్​ బాధితులను తీసుకెళ్లాలంటే ఒకరేటు.. కొవిడ్​ మృతుల మృతదేహాలను తరలించాలంటే మరో రేటు చొప్పున దంటుకుంటున్నారు. విపత్కాల సమయంలోను కొందరు అంబులెన్సు నిర్వాహకులు ముక్కుపిండిమరీ వసూలు చేస్తున్నారు.

Telangana news
అంబులెన్సులు

By

Published : May 14, 2021, 5:01 PM IST

కరోనా రెండో దశ శరవేగంగా వ్యాపిస్తోంది. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లాల్సినవారు అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అంబులెన్సు నిర్వాహకులు నోటికొచ్చినంత అడుగుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్​కు అత్యవసర చికిత్స కోసం తరలిస్తున్నారు. నగరంలోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోను కొవిడ్​ చికిత్సలు అందిస్తున్నాయి. ఇక్కడకు చేరుకోవాలంటే దారిలోనే జేబు ఖాళీ అయిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్​ చికిత్సకే లక్షలు అవుతున్నాయంటే... ఆస్పత్రికి రావడానికి వేలల్లో అవుతున్నాయని వాపోతున్నారు. కష్టకాలాన్ని సొమ్ము చేసుకుంటున్నట్లుగా... అంబులెన్సు డ్రైవర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎంతడిగితే అంత ఇవ్వాల్సిందే…

కొవిడ్​ బాధితులను అంబులెన్సులో తీసుకెళ్లాలంటే సుమారు 20 వేల వరకు డిమాండ్​ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ కుటుంబ సభ్యుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్​ నిర్వహకులు 20 వేలు అడిగారని సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని బాపూజీనగర్​కు చెందిన అజిత్ కన్నీటి పర్యంతమయ్యారు. సాధారణ సమయంలో రూ.8వేల లోపు తీసుకుంటారని... అలాంటిదిప్పుడు 20 వేలు అడుగుతున్నారని వాపోయారు. ఇక మృతదేహాలను తరలించాలంటే వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.

బాధితులంతా మౌనంగా భరిస్తున్న ఈ బహిరంగ దోపిడీపై ప్రభుత్వం చొరవ తీసుకుని అంబులెన్సులు యాజమాన్యాలు వసూలు చేస్తున్న ధరలపై చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ సమయంలో మరింత క్షోభ పెట్టొద్దు..

అంబులెన్స్ నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కష్టకాలంలో అండగా ఉండాల్సింది పోయి ఇలా దండుకోవడం దారుణమన్నారు. కొవిడ్​తో క్షోభలో ఉన్నవారిని మరింత ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తమ కమిషనరేట్​ పరిధిలో ఉచితంగా అంబులెన్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్

ABOUT THE AUTHOR

...view details