తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. తితిదే దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి..ఉన్నతాధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమాడవీధుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆయన..దీనిపై పునరాలోచన చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన..కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్ని వివరించారు. ఉత్సవాలు, మాడవీధుల్లో నిర్వహించే పక్షంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు.
కరోనా కారణంగా గతనెలలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన తితిదే..ఈనెల 16నుంచి 24వరకు నిర్వహించనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరువీధుల్లో జరపాలని నిర్ణయించింది. ఈనెల1న అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించిన అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దర్శన టికెట్లు ఉన్నవారికి మాత్రమే తిరుమలకు అనుమతించాలని భావించి..అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు జరిగే సమయంలో..రోజుకు 16 వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ టికెట్లను విడుదల చేశారు. వీటితోపాటు శ్రీవాణి ట్రస్టు, కల్యాణోత్సవం టికెట్లను విక్రయించారు.