Ambedkar Statue Unveils in Hyderabad today : భారతదేశం, ప్రజలు, భవిష్యత్తు తరాలకోసం రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడిగా అంబేడ్కర్ చేసిన కృషి, త్యాగం అజరామరం. అత్యున్నత స్థాయిలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడమంటే వారి అత్యున్నత ఆశయాలు భవిష్యత్ తరాలకు తెలియపర్చడమే. బాబాసాహెబ్.. తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం, ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో రూపొందించి పొందు పరిచారని.. అదే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ఏడేళ్ల క్రితం బీజం పడింది. అంబేడ్కర్ 132వ జయంతి రోజున దేశంలోనే అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
అనుకున్నదే తడవుగా:రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయం ముందు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సమీపంలోనే సాగర్లో నెలకొన్న బుద్దుడి విగ్రహం కూడా నెలకొని ఉంటుంది. ఈ ప్రాంతంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమావేశ మందిరం, ఓపెన్ ప్లాజా, లైబ్రరీ, పార్క్, పార్కింగ్ ప్లేస్, మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆ రోజు సీఎం కేసీఆర్ భావించారు. అనుకున్నదే తడవుగా సంబంధిత మంత్రులు, అధికారులను పిలిపించి అంబేడ్కర్ విగ్రహ ప్రణాళిక వివరించి వెంటనే అమలుకు ఆదేశాలు జారీ చేశారు. నాటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
కరోనాతో ఆలస్యం:అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు చైనాలోనూ విస్తృతంగా పర్యటించి విగ్రహాల ఏర్పాటుపై అధ్యయనం చేసింది. తర్వాత ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావంతో విగ్రహ ఏర్పాటు ఆలస్యమైంది. తదుపరి చోటుచేసుకున్న పరిణామాలకు అనుగుణంగా దేశీయంగానే విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యల్ని వేగవంతం చేశారు.