తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్‌. అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బాబాసాహెబ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి అంబేడ్కర్‌ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు.

Ambedkar Jayanti celebrations
Ambedkar Jayanti celebrations

By

Published : Apr 14, 2021, 8:18 PM IST

అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఘన నివాళులర్పించారు. శాసనసభ ప్రాంగణంలోని విగ్రహం వద్ద సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సహా వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు స్థాపించి అంబేడ్కర్​ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొనగా.. ఈనాటికీ రిజర్వేషన్‌ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరమని ఈటల తెలిపారు.

కేంద్రమంత్రి నివాళులు..

హైదరాబాద్ బాలానగర్ డివిజన్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలానగర్‌ మెట్రోస్టేషన్‌కు అంబేడ్కర్‌ బాలానగర్‌ మెట్రోస్టేషన్‌గా నామకరణం చేసిన సందర్భాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో అంబేడ్కర్ చిత్రపటానికి సీపీ మహేశ్‌ భగవత్‌ నివాళులర్పించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పాలన జరుగుతోందని వారు పేర్కొన్నారు.

సిద్దిపేటలో హరీశ్​.. కరీంనగర్​లో గంగుల

సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలో అంబేడ్కర్​ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మారెడ్డిపల్లిలో అంబేడ్కర్​ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కరీంనగర్‌లో అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మంత్రి గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌.. బాబాసాహెబ్‌ స్ఫూర్తిని గుర్తుచేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్​రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నివాళి అర్పించి కేక్ కట్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేశారు.

ఇదీ చూడండి: 'అంబేడ్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంక్షేమం'

ABOUT THE AUTHOR

...view details