Amazon Web Services investments in Hyderabad: హైదరాబాలోని వెబ్‌సర్వీసెస్ డేటా సెంటర్లలో అదనపు పెట్టుబడిపెట్టి విస్తరించేందుకు అమెజాన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో.. దావోస్ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కేటీఆర్.. అమెజాన్ అదనపు పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలపై సంతోషం వ్యక్తంచేశారు. 2030 నాటికి.. రూ. 36,300 కోట్లు పెట్టుబడిగా పెడతామన్న అమెజాన్ నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు.
అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ.. డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెజాన్, తెలంగాణ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. ఆ సంస్థ విస్తరణ ప్రణాళికలకు.. సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారులకు.. అత్యుత్తమ క్లౌడ్ సేవలను అందించేందుకు చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్లను.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు రూ.20,096 కోట్ల పెట్టుబడులను రూ.36,300 కోట్లకు పెంచడం.. రాష్ట్రంలో వ్యాపారానుకూల వాతావరణానికి నిదర్శనమని వివరించారు.
2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో రూ.36,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ నెట్వర్క్ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్‌లో తెలంగాణ ప్రభుత్వం అమెజాన్ నుంచి మరింత పెట్టుబడులను స్వాగతించింది.