Amaravati Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నీరాజనాలు పలుకుతోంది. 24వ రోజు సున్నంబట్టి నుంచి రాజుపాలెం వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో మద్దతు వెల్లువెత్తింది. రాజుపాలేనికి చెందిన కొందరు రైతులకు క్షీరాభిషేకం చేశారు. పాలతో రైతుల కాళ్లు కడిగారు. మీ వెంట మేముంటామంటూ ఉద్వేగంగా చెప్పగా.. మహిళా రైతులు భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. ముదివర్తికి చెందిన ఇద్దరు చిన్నారులు మన్హా, మహీర్.. పాదయాత్ర (farmers padayatra)లో తమతో కలిసి నడవడంపై రాజధాని రైతు కోటేశ్వరరావు చలించారు. స్థానికుల దగ్గర నుంచి పాలు తీసుకుని.. ఆ చిన్నారుల కాళ్లకు అభిషేకం చేశారు. ఎంతమంది మనసుమారినా ప్రభుత్వం మారడం లేదని రైతులు అన్నారు.
‘నాది నెల్లూరు జిల్లా నా రాజధాని అమరావతి’అంటూ కొందరు నినాదాలు చేస్తూ రైతులకు కొత్త ఉత్సాహంఇచ్చారు. రైతుల పాదయాత్ర(Amaravati farmers padayatra news) సాగిన ప్రతి గ్రామంలోనూ స్థానికులు.. వివిధ రూపాల్లో మద్దతు తెలిపారు. రాచర్లపాడు, రేగడిచెలిక గ్రామాల్లో మహిళలు హారతులుపట్టారు. చంద్రశేఖరపురంలో పూలతో స్వాగత రంగవల్లులు వేశారు. ప్రవాసులు సైతం.. రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. రాత్రి రైతులు బసచేసిన రాజుపాలెంలో గ్రామస్థులు ఎదురేగి... మేళతాళాలు, డప్పుల మోతలు, కోలాట నృత్యాలతో స్వాగతం పలికారు. ఇవాళ పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు(today break for padayatra) ఐకాస ప్రకటించింది.
దారి పొడవునా జేజేలు..
పాదయాత్ర చేస్తున్న వారికి దారి మధ్యలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దారి పొడవునా ఫలహారాలు అందజేశారు. నెల్లూరుకు చెందిన బోయపాటి ఫుడ్స్ వారు రాచర్లపాడు దగర ఉండి.. యాత్రలో పాలొన్న రైతులతో పాటు మద్ధతు తెలిపేందుకు వచ్చిన వారందరికీ స్వీట్లు, హాటు ప్యాకెట్లు ఇచ్చారు. నరసరావుపేటకు చెందిన డాక్టర్ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో అల్పాహారం ఇచ్చారు. బీద రవిచంద్ర ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికిల్ కిట్లు అందజేశారు. వీరితో పాటు స్థానికులు అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. అమరావతి జేఏసీ ప్రతినిధులు మంచినీళ్లను ఇచ్చారు. రాచర్లపాడు, రేగడిచెలిక, పెయ్యలపాళెం, చంద్రశేఖరపురం, పైడేరు, కమ్మపాళెం, బొడ్డువారిపాళెం, నాయుడుపాళెం, గండవరం రోడ్డు మీదగా రాజుపాళెం వరకు 15కి.మీల వరకు యాత్ర సాగింది.