తెలంగాణ

telangana

ETV Bharat / state

Amaravati Farmers Sabha : నేడే మహోద్యమ సభ.. హాజరుకానున్న చంద్రబాబు - Farmers Tirupati Sabha

Amaravati Farmers Sabha : ఆంధ్రప్రదేశ్​లో అమరావతి అందరిదీ అనే నినాదంతో.. రాజధాని ప్రాంతం వెలుపల తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహణకు రైతులు సిద్ధమయ్యారు. తిరుపతి వేదికగా నేడు జరగనున్న 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భావి తరాల భవిష్యత్తు, మన బిడ్డల బాగు కోసం అమరావతి నిర్మాణం అవసరమనే సందేశాన్ని సభ ద్వారా చాటనున్నారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.

Amaravati Farmers Sabha, Farmers Tirupati Sabha
మహోద్యమ సభ

By

Published : Dec 17, 2021, 7:13 AM IST

Amaravati Farmers Sabha : న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో నేడు నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే రైతులు, మహిళలు 44 రోజుల పాటు తుళ్లూరు నుంచి అలిపిరి వరకు పాదయాత్ర చేశారు. మహాపాదయాత్ర ముగింపుగా తిరుపతిలో 17వ తేదీన సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులను అనుమతి కోరగా వివిధ కారణాలను చూపుతూ నిరాకరించారు. చివరికి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సభ నిర్వహణకు అనుమతించడంతో అమరావతి పరిరక్షణ సమితి నేతలు సభ నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ సభ ద్వారా అమరావతి రాజధాని రైతుల త్యాగాలతోపాటు, అక్కడే రాజధాని ఎందుకు ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తుకు ఎలా దోహదపడుతుందనే అంశాలను వివరించనున్నారు.

యుద్ధప్రాతిపదికన పనులు

Farmers Tirupati Sabha: అమరావతి మహోద్యమ పరిరక్షణ సభకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. బుధవారం రాత్రి న్యాయస్థానం ఆదేశాలు అందడంతో అప్పటికప్పుడు తిరుపతి పరిధిలోని దామినీడు వద్ద.. వాహనాలకే ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేసి స్థలంలో ఉన్న ముళ్ల కంచెలను తొలగించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో బుధవారం ఉదయం.. శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఉదయం నుంచి జేసీబీలు, ప్రొక్లెయిన్ల ద్వారా సభ ప్రాంగణాన్ని మొత్తం చదును చేశారు. రోలర్ల ద్వారా మట్టిని చదును చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో.. ఆ మేరకు వేదికను సిద్ధం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు, వివిధ సంఘాల నేతలు, మహిళలు పాల్గొననున్న నేపథ్యంలో.. అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సభకు హాజరయ్యేవారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ తిలకించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రానికి సభా ప్రాంగణాన్ని ఒక దిశకు తీసుకువచ్చారు..

హాజరుకానున్న ప్రముఖులు

అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన నేతలు సభకు వస్తున్నారు. భాజపా నుంచి ఆ పార్టీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శులు అతుల్‌కుమార్‌ అంజన్, కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సబ్యులు హరినాథరెడ్డి, రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య హాజరుకానున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. జనసేన పార్టీ నుంచి పీఏసీ సభ్యులు హరిప్రసాద్, తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్, కాంగ్రెస్‌ నుంచి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలీ తదితరులు హాజరుకానున్నారు.

సభ నిర్వహణకు సంబంధించి ఐకాస నేతల దగ్గర నుంచి పోలీసులు అఫిడవిట్‌ తీసుకున్నారు. పోలీసులు పేర్కొన్న నిబంధనల మేరకు సభ నిర్వహిస్తామంటూ అందులో పొందుపర్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తామని, ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చూస్తామని, ఎక్కడా మారణాయుధాలను తీసుకురామని ఇలా వివిధ అంశాలను పొందుపర్చి అఫిడవిట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత దానికి అనుగుణంగా పోలీసులు వివిధ షరతులను వర్తింజేస్తూ అనుమతులు ఇచ్చారు. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ అనంతరం... అమరావతి రైతులు.... భవిష్యత్ కార్యాచరణపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రజల కోసం పని చేయాలి

రాజకీయ నాయకులు అధికారం కోసం కాకుండా రాష్ట్రం, ప్రజల కోసం పని చేయాలని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు. తిరుపతిలోని రామానాయుడు కల్యాణ మండపంలో.. మహాపాదయాత్రలో పాల్గొన్న క్రైస్తవుల కోసం ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతుల పాదయాత్ర విజయవంతం కావడమే అమరావతి అందరిదీ అని చెప్పడానికి పెద్ద నిదర్శనమన్నారు. అన్ని కులమతాలకు సంబంధించినది అమరావతి అని ఈ కార్యక్రమం ద్వారా రుజువైందన్నారు. గతంలో యాత్రపై విమర్శలు చేసిన వారు ప్రజల నుంచి స్పందన చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని శివాజీ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:corona effect on Industries: సంక్షోభంలో పరిశ్రమలు.. కరోనా దెబ్బ నుంచి కోలుకునేదెలా..!

ABOUT THE AUTHOR

...view details