ఏపీలో రాజధానికి భూములు ఇచ్చి.. రోడ్డున పడ్డ అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాయపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు. సభా ప్రాంగణంలో 12 వేల కుర్చీలు వేశారు. మరో 10 వేల మంది కింద కూర్చునేలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. చాలామంది వెనక వైపు, సభాస్థలికి అటూ ఇటూ నిల్చుని ఉన్నారు. 30 వేల మంది వస్తారని నిర్వాహకులు భావించగా... వారి అంచనాలు ఏ మాత్రం తప్పలేదు.
ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారే..
పోలీసులు ఆంక్షలు విధించడం వల్ల బయటి ప్రాంతాల నుంచి జనం వచ్చే వీలు లేకపోయింది. కనీసం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలను అనుమతించినా సభికుల సంఖ్య రెట్టింపయ్యేది. కేవలం రాజధాని గ్రామాల నుంచి మాత్రమే ఇంత భారీగా తరలిరావటం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. అమరావతి పోరాటం మొదలయ్యాక ఇంత భారీ స్థాయిలో జన సమూహం ఓ చోటకు రావడం ఇదే మొదటిసారి. మూడు రాజధానుల పట్ల తమ వ్యతిరేకత, అమరావతి రాజధానిగా ఉండాలనే ఆకాంక్షను రాజధాని రైతులు ఈ సభ ద్వారా వ్యక్తపరిచారు. ఎప్పటిలాగే మహిళల సంఖ్య ఎక్కువగా కనిపించింది. అమరావతిని రాజధానిగా సాధించే వరకు ఈ పోరాటం ఆపేది లేదని.. రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ఇకనైనా కళ్లు తెరవాలని కోరారు.
ఆ రెండు పార్టీలు మినహాయించి