(Amravati Farmers Maha Padayatra) అమరావతి రైతుల మహాపాదయాత్ర 23 వరోజుకు చేరుకుంది. ఇవాళ నెల్లూరు జిల్లా కొండబిట్రగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సున్నంబట్టి వరకు 15 కిలోమీటర్లు యాత్ర పాదయాత్ర కొనసాగనుంది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర డిసెంబర్ 15న తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. నిన్న సీఎం జగన్ ప్రకటనతో ధ్వజమెత్తిన అన్నదాతలు...పాదయాత్రను మరింత ఉద్ధృతంగా ముందుకు సాగించారు. నిన్న 13 కిలోమీటర్ల మేర నడిచిన రైతులు... కొండబిట్రగుంట చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు.
Three Capitals Repeal Bill: ఏపీలో మూడు రాజధానుల చట్టంపై సోమవారం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెుదట రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవటాన్ని స్వాగతించిన రైతులు.. ఆ తరువాత మళ్లీ సమగ్రంగా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకువస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించటంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపం, మెుండి వైఖరితో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.