Galla Jayadev on Amara Raja Investments: తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అమరరాజా సంస్థను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిందని ఆ సంస్థ ఛైర్మన్, ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ సంస్థ పెట్టుబడులన్నీ ఏపీకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. పలు కారణాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టలేకపోయామని వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన అవగాహన ఒప్పందం కార్యక్రమంలో గల్లా జయదేవ్ పాల్గొని మాట్లాడారు.
పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.. ఇప్పుడు మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) మంచి డిమాండ్ ఏర్పడిందని గల్లా జయదేవ్ అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని భావించామన్నారు. భారత్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీపై గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు సరైన ప్రాంతం కోసం చూశామన్న ఆయన... దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలపై విస్తృతంగా విశ్లేషించామని పేర్కొన్నారు.