తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మె ఎఫెక్ట్​: ప్రత్యామ్నాయాలపై అధికారుల కసరత్తు..! - ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ సమ్మె అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిపిన రెండు సుదీర్ఘ చర్చలు విఫలం కాగా... మరోమారు చర్చించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కార్మికసంఘాలు సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించటం వల్ల... రవాణాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు.

Alternate_Arrangements_In_rtc_Due_to_samme_effect

By

Published : Oct 4, 2019, 5:59 AM IST

Updated : Oct 4, 2019, 7:09 AM IST

సమ్మె ఎఫెక్ట్​: ప్రత్యామ్నాయాలపై అధికారుల కసరత్తు...!

పండుగ సమయంలో ఆర్టీసీ సమ్మె అంశం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండు రోజుల సుదీర్ఘ చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. బతుకమ్మ, దసరా పండుగలను దృష్టిలో పెట్టుకున్న త్రిసభ్య కమిటీ... ఓవైపు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూనే... మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.

ప్రత్యామ్నాయ చర్యల్లో అధికారులు....

ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన టూరిస్ట్, పాఠశాలల బస్సులను, మ్యాక్సీక్యాబ్​లను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం రూ.100 నుంచి రూ.200 వరకు రుసుము తీసుకుని రవాణాశాఖ అధికారులు తాత్కాలిక పర్మిట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా వాహనాల సామర్థ్యాన్ని పరిశీలించి, పరీక్షించి ఫిట్​గా ఉన్న వాహనాలనే ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతివ్వాలని అధికారులు స్పష్టం చేశారు. వాహనాలకు కొన్ని నిబంధనలు కూడా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడవవద్దని, ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, ఆర్టీసీ బస్సుల ధరలనే తీసుకోవాలని స్పష్టం చేశారు.

తాత్కాలిక పద్ధతిలో నియామకాలు...

ఆర్టీసీ ఐకాస సమ్మెకు వెళ్తే... ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారుల స్థానంలో తాత్కాలిక పద్ధతిన నియామకం చేపట్టాలని రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొన్ని జిల్లాల్లో తాత్కాలిక ఉద్యోగాలకు పత్రికా ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఆసక్తిగల డ్రైవర్లు, కండక్టర్లను రాష్ట్రంలోని ఆయా రీజినల్ ట్రాన్స్​పోర్ట్ కార్యాలయాలల్లో తాత్కాలిక పద్ధతిలో నియామకం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. డ్రైవర్లకు రూ.1,500, కండక్టర్లకు రూ.1,000 రోజువారి వేతనంగా నిర్ణయించారు.

రిటైర్డ్​ ఉద్యోగులకూ అవకాశాలు...

ఆర్టీసీలో పనిచేసి పదవీవిరమణ పొందిన అధికారులకు సమ్మెకాలంలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పదవీవిరమణ పొందిన సూపర్​వైజర్లు, మెకానిక్​లు, క్లర్కు​లను తాత్కాలిక పద్ధతిన నియామకం చేపట్టాలని భావిస్తున్నారు. రిటైర్డ్ సూపర్​వైజర్​లకు రూ.1,500, రిటైర్డ్ మెకానిక్​లకు రూ.1,000, రిటైర్డ్ క్లర్క్​లకు రూ.1,000గా రోజువారి వేతనాలు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇవీ చూడండి: ఈనెల 5న సమ్మె ఉంటుంది: ఆర్టీసీ ఐకాస

Last Updated : Oct 4, 2019, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details