తెలంగాణ

telangana

ETV Bharat / state

జలకళ: కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద తాకిడి - ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువకు వస్తోన్న వరద నీరు

గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి సగటున 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగితే.. నెల రోజుల్లో ఆల్మట్టి పూర్తిగా నిండే అవకాశం ఉంది.

almatti-project-ongoing-flood-to-krishna-projects-in-telangana
కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతోన్న వరద తాకిడి

By

Published : Jul 9, 2020, 5:52 PM IST

కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద తాకిడి ప్రారంభమైంది. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తుండటం వల్ల ప్రస్తుతం ఆల్మట్టి నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టికి సగటున 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా..10 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తి స్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు. ప్రస్తుతం ఆల్మట్టిలో 1694 అడుగుల నీరుండగా.. 82 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది. గతేడాది ఈ సమయానికి ఆల్మట్టిలో కేవలం 46 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగినా.. పెరిగినా నెలరోజుల్లో పూర్తిగా నిండి దిగువకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది.

నారాయణపూర్ జలశాయం

  • నారాయణపూర్ జలాశయానికి ప్రస్తుతం ఆల్మట్టి నుంచి సగటున 10 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
  • జలశాయం పూర్తి స్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు.
  • ప్రస్తుతం ఈ జలశాయంలో 1605 అడుగుల వరకు నీళ్లున్నాయి. 25 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
  • గత ఏడాది ఇదే సమయానికి నారాయణపూర్ జలాశయంలో కేవలం 19 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది.
  • దిగువకు ఎలాంటి వరద నీటిని ప్రస్తుతానికి విడుదల చేయడం లేదు.
  • మరో 11 టీఎంసీల ప్రవాహం నారాయణపూర్​కు చేరితే జూరాలకు నీళ్లు విడుదల చేసే అవకాశం ఉంది.

జూరాల పరిస్థితి

  • ప్రస్తుతానికి జూరాలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కేవలం 2 వేల577 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే వస్తోంది.
  • జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు.
  • ప్రస్తుతం జూరాలలో 1041 అడుగుల మట్టంలో, 7.80 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతోంది.
  • గత ఏడాది ఇదే సమయానికి జూరాలలో కేవలం 1.96 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది.
  • జూన్ మొదలుకుని ఇప్పటి వరకూ జూరాలకు 3.94 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి.

వచ్చిన వరదను వచ్చినట్టే ఎత్తిపోసేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఇప్పటికే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750 క్యూసెక్కులు, భీమ ఎత్తిపోతల పథకానికి 650 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. కోయిల్ సాగర్, సమాంతర కాలువ, జూరాల ఆయకట్టుకు నీటి విడుదల ఇంకా మొదలు కాలేదు. తుంగభద్రకు మాత్రం 16 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

ఇదీ చూడండి :కోటి విత్తన బంతులతో గిన్నిస్​ రికార్టు సాధిస్తాం: మంత్రి శ్రీనివాస్​గౌడ్

ABOUT THE AUTHOR

...view details