తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Secretariat: ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న సచివాలయం.. సీఎం ఆఫీస్‌ ఆరో అంతస్తులో

Telangana Secretariat Allotments: సువిశాల 28 ఎకరాల విస్తీర్ణంలో ఆరంతస్తుల్లో నిర్మితమైన తెలంగాణ ప్రజాసౌధంలో కార్యాలయాలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన ఛాంబర్లు అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్నాయి. ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన సీఎం కార్యాలయం మంత్రుముగ్ధుల్ని చేస్తుండగా.. సమావేశాలు, సందర్శకుల కోసం ప్రత్యేక హాళ్లు కేటాయించారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులకు ఆహ్లాద భరితమైన విశాలమైన గదులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

Telangana Secretariat
Telangana Secretariat

By

Published : Apr 30, 2023, 6:34 AM IST

ఇంద్ర భవనాన్ని తలపించేలా నూతన సముదాయ నిర్మాణం

Telangana Secretariat Allotments: హుస్సేన్‌సాగర్‌ తీరాన పాత సచివాలయ భవనాలను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన నూతన సముదాయం బయటి నుంచి చూపరుల కళ్లను ఎంతలా కట్టి పడేస్తుందో.. లోపలికెళితే అత్యాధునిక సౌకర్యాలూ అంతే అబ్బురపరుస్తున్నాయి. మొత్తం 10లక్షల 51వేల 676 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవంతిని 265 అడుగుల ఎత్తులో.. గ్రౌండ్‌, అండర్‌గ్రౌండ్‌ ఫ్లోర్‌లతో కలిసి ఎనిమిది అంతస్తులుగా నిర్మించారు. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలు ఉండనుండగా.. ఒక్కో అంతస్తును మూడ్నాలుగా శాఖలకు చొప్పున కేటాయించారు.

ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌ పరిచిన ఆ ప్రాంతం చూపరులను ముగ్ధులను చేస్తోంది. సీఎం కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ 4 మందిరాలతో పాటు సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆశీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు.

ఏఏ అంతస్తుల్లో ఏ శాఖలు ఉన్నాయి:

1. గ్రౌండ్‌ ఫ్లోర్‌: ఎస్సీ సంక్షేమం, అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పనశాఖలకు కేటాయించారు.

2. మొదటి అంతస్తు: హోం, విద్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ఛాంబర్లు ఉండనున్నాయి.

3. రెండో అంతస్తు: వైద్య ఆరోగ్య, విద్యుత్‌, పశుసంవర్ధక, ఆర్థిక శాఖలకు కేటాయింపు చేశారు.

4. మూడో అంతస్తు: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, పురపాలక, పట్టణాభివృద్ధి- ప్లానింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలతో పాటు వ్యవసాయ, సహకార, పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యాలయాలు ఉంటాయి.

5. నాలుగో అంతస్తు: పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమం, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, నీటిపారుదల, న్యాయశాఖలకు కేటాయించారు.

6. అయిదో అంతస్తు: రవాణా, రహదారులు- భవనాలు, సాధారణ పరిపాలన శాఖలు ఉండనున్నారు.

7. ఆరో అంతస్తు: ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సీఎం కార్యదర్శులు, ముఖ్యమంత్రి పేషీ ప్రత్యేకాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గదులు ఉంటాయి. సంబంధిత శాఖకు చెందిన మంత్రి, తన పేషీ, శాఖ కార్యదర్శి, ఉద్యోగ విభాగాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త భవనంలో కేటాయింపులు చేశారు. గతంలో కొన్ని శాఖలు మినహాయిస్తే చాలా వరకు మంత్రి పేషీ ఒక అంతస్తులో.. కార్యదర్శి, ఉద్యోగులు మరో అంతస్తుల్లో ఉండేవారు. అలాంటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. వాస్తు, ఇతర కారణాల రీత్యా కేటాయింపులు చేసినందున వీటి మార్పులకు అవకాశం ఉండదని తెలుస్తోంది.

విశేషాల సమాహారం.. నూతన సచివాలయం:కాగా ప్రత్యేక అలంకరణలు, కొత్త ఫర్నీచర్‌తో సచివాలయం లోపల ఆకర్షణీయంగా కనిపించేలా.. ఛాంబర్లు, వర్క్ స్టేషన్లను తీర్చిదిద్దారు. అధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి తగిన వసతులు కల్పించారు. ప్రతి అంతస్తులోనూ భోజనశాల, కెఫ్టేరియా, టాయిలెట్స్, తదితర వసతులను కల్పించారు. మంత్రుల ఛాంబర్లు, పేషీలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫర్నీచర్, సామాగ్రి పూర్తిగా ఏక రూపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇష్టారీతిన కాకుండా అందరికీ ఒకే తరహా ఫర్నీచర్ అమరుస్తున్నారు. సచివాలయంలో మొత్తం 30 సమావేశ మందిరాలు ఉండగా.. అన్ని చోట్ల నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించారు. అటు అధికారులు, ఉద్యోగులకు సైతం ఆహ్లాద భరితమైన విశాలమైన గదులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details