నూతన జోనల్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో పోస్టుల విభజన చేయకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ పది జిల్లాలను 2 జోన్లుగా విభజించారు. పది జిల్లాలు ఐదు, ఆరు జోన్లలో కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం స్థానికులకు ఎక్కువగా ఉద్యోగాలు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న 31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా నూతన విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అమలుకు నోచుకోని ప్రతిపాదనలు
ములుగు, నారాయణపేట జిల్లాలను చేర్చడంతో పాటు వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చాలన్న ప్రతిపాదన రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. కొత్త విధానం నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా విభజించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అన్ని శాఖలు ఆయా జిల్లాల వారీగా పోస్టులను విభజించి పంపాయి. అయితే పోస్టుల వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
ఏ విధానం పాటిస్తారో..?